గ్రామీణ వైద్యుల సేవలు ప్రజారోగ్యానికి కీలకం
మచిలీపట్నంఅర్బన్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే గ్రామీణ వైద్యుల సేవలు ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. రాష్ట్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం (ఆర్‌ఎండబ్ల్యూపీఏపీ) వార్షిక సమావేశం వ్యవస్థాపక అధ్యక్షుడు బండి రామాంజనేయులు అధ్యక్షతన కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఎన్. కన్వెన్షన్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యులు పేద ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. డాక్టర్ పల్లెం ఆకాష్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల సేవలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ వైద్యుల సంక్షేమానికి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. కార్యక్రమంలో కొనకళ్ల బుల్లయ్య, జాతీయ ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘాల సమైక్య అధ్యక్షుడు కొండిశెట్టి సురేష్, ఆర్‌ఎండబ్ల్యూపీఏపీ ఉపాధ్యక్షుడు ఎ.కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జి.నందగోపాల్, కోశాధికారి ఎ.డేవిడ్ రాజు పాల్గొన్నారు.


