అధికారిక అడ్డా
పేకాటరాయుళ్లకు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేకాట శిబిరాలు జోరుగా నడుస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ శిబిరాలు నడుస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు మొక్కుబడి దాడులతో సరిపెడుతు న్నారు. సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టిన పోస్టు పేకాట జోరుకు నిదర్శనంగా నిలిచింది. ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్‌కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్. పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్’ అంటూ ఆయన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ఇది నియోజకవర్గంలో విచ్చలవిడిగా పేకాట నిర్వహిస్తున్న తీరును, పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. విస్సన్నపేట మండలంలోని కొండపర్వ గట్టుపై నిత్యం పేకాట క్లబ్బు నడుపుతున్నారని ఆ మండల ముఖ్య నాయకు డిని ఉద్దేశించి ఎమ్మెల్యే కొలికపూడి వాట్సాప్ స్టేటస్‌లో చేసిన కామెంట్లు టీడీపీ నాయకులు, పోలీసులను ఇరకాటంలో పడేశాయి. ఇక్కడ ప్రజాప్రతినిధుల మధ్య వివాదం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు పార్లమెంట్ ప్రజాప్రతినిధి క్యాంపు కార్యాలయాల పేరుతో మండల కేంద్రాల్లో పార్టీ ఆఫీసులను ఏర్పాటు చేశారు. తిరువూరు, విస్సన్నపేటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాల్లోకి ఎమ్మెల్యేకు, ఆయన అనుచరులకు ప్రవేశం లేకుండా అడ్డుకట్ట వేశారు. గతంలో పలుమార్లు పార్టీ నాయకులపైనే ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే ఈ సారి విస్సన్న పేటలో ఓ నాయకుడిని పరోక్షంగా ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమాల్లో చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. గతంలో తిరువూరులో గంజాయి అమ్మకాలపై కూడా పార్లమెంటు ప్రజాప్రతినిధి వర్గీయులను టార్గెట్ చేస్తూ పోలీసుస్టేషనులో ఎమ్మెల్యే హల్‌చల్ చేశారు.
పెనమలూరులో..
పెనమలూరులో పేకాట శిబిరాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రధానంగా పోరంకి–నిడమానురు రోడ్డు, వణుకూరు శివారు ప్రాంతాలు, కానూరు, పోరంకిలోని నివాస సముదాయాలు, ఈడుపుగల్లు, ఉప్పులూరు, యనమలకుదురు లంకలు, కోలవెన్ను, కంకిపాడులోని వాణినగర్, ఉయ్యూరు శివారు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. పోరంకిలో గత ఏడాది నియోజకవర్గ ప్రజాప్రతినిధి అనుచరుడి పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల పోరంకింలో టీడీపీ నాయకురాలి భర్త దొరి కాడు. కానూరులో ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నారని తెలిసి పోలీసులు దాడిచేస్తే రూ.2 లక్షలు దొరికాయి. పెనమలూరు పోలీసుస్టేషన్‌లోని కానిస్టేబుల్ పేకాట శిబిరాల అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కంకి పాడు మండలం కోలవెన్ను గ్రామానికి చెందిన ఓ మంత్రి అనుచరుడు కొలుసు లక్ష్మణ్ ఉప్పులూరులో అద్దెకు తీసుకున్న ఇంట్లో కోతముక్క నిర్వహిస్తుండగా కంకిపాడు పోలీసులు పట్టుకున్నారు. 13 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద రూ.1,72,400, ఒక కారు, పది సెల్‌ఫోన్‌న్లను స్వాధీనం చేసుకున్నారు.
● గన్నవరం నియోజకవర్గంలోని ఆత్కూరు, సూరంపల్లిలో పేకాట శిబిరాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి.
● గుడివాడలో వన్‌టౌన్ పరిధిలో హోటళ్లు, లాడ్జిలు, నివాస గృహాలు, నందిగామ మండలంలో గాజులపాడు, పోలుకొండ, ఇలపర్రు, పుట్టుగుంట ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలతోపాటు, జనసేన నాయకులు చేతులు కలిపి పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారు.
● పెడన నియోజకవర్గంలో మొబైల్ జూదం నడిపిస్తున్నారు.
● అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రతిరోజు పెద్ద ఎత్తున పేకాట జరుగుతోంది. ఘంటసాల మండలం కొడాలి, కోడూరు మండలం మందపాకల శివారు ప్రాంతం, నాగాయలంక బస్టాండు ప్రాంతాల్లో జోరుగా పేకాట సాగుతోంది. ఇక్కడ ముఖ్యంగా ఓ సామాజిక వర్గం చెందిన ముఖ్యనేతలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అవనిగడ్డ మండలంలో జనసేన నేత పలుచోట్ల పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. చల్లపల్లి మండలంలో ప్రాంతాలు మారుస్తూ పేకాట ఆడుతున్నారు.
● మచిలీపట్నం నియోజకవర్గంలో పేకాట యథేచ్ఛగా జరుగుతోంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో యథేచ్ఛగా పేకాట శిబిరాలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే శిబిరాల నిర్వహణ తిరువూరు ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్‌లో సంచలన వ్యాఖ్యలు ఎన్టీఆర్ సొంత గ్రామంలో యథేచ్ఛగా సాగుతున్న జూదం
పామర్రులో పేకాట జోరు
పామర్రు నియోజకవర్గంలో పేకాట జోరుగా సాగుతోంది. ప్రధానంగా మొవ్వ మండలంలోని క్రోసూరు పేకాట డెన్‌గా మారింది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇక్కడ విచ్చలవిడిగా పేకాడిస్తున్నారు. పామర్రుతోపాటు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు, ఏలూరు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పేకా డుతున్నారు. ఈ డెన్‌పై పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. ఇటీవల క్రోసూరులో పేకాట శిబిరాలపై దాడికి వెళ్లిన ఓ పోలీసు అధికారిపై జూదరులు దాడికి యత్నించారంటే, ఎంత బరితెగించారో ఇట్టే తెలిసిపోతోంది. దీంతో ఆ పోలీసు అధికారి ఇక్కడ పనిచేయలేక ఇటీవల బదిలీపై వెళ్లినట్లు నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. సాక్షాత్తూ ఎన్టీఆర్ సొంత గ్రామం నిమ్మకూరులో సైతం పేకాట జోరుగా సాగు తోంది. ఇక్కడ డిమ్ అండ్ డిప్ వంటి వ్యక్తి ఆటను సాగిస్తున్నారు. ఈ తతంగం అంతా పమిడిముక్కల పోలీసు అధికారికి తెలిసే జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పామర్రులోని కొత్త పెద్దమద్దాలి శివారు ప్రాంతంలో యథేచ్ఛగా పేకాట శిబిరం కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నా కింది స్థాయిలో కొంత మంది పోలీసు అధికారుల తీరు వల్లే పేకాటకు అద్దూఅదుపూ లేకుండా పోతోంది. పామర్రు ప్రాంతంలో మచిలీపట్నం నగరంలోని బలరామునిపేటకు చెందిన పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు.
అధికారిక అడ్డా


