అధిక మొత్తం ఆశ చూపి కుచ్చుటోపీ!
జీవితాల్లో వెలుగులు నింపుతాడని నమ్మారు చివరకు చిమ్మచీకట్లో ముంచేసి పోయారు రూ.30 కోట్ల మేరకు డిపాజిట్లు స్వాహా బోర్డు తిప్పేసి అదృశ్యం
విస్సన్నపేట: మీ జీవితాల్లో వెలుగులు నింపుతా... మీరు పెట్టే పెట్టుబడికి ఎవ్వరూ ఇవ్వనంత ప్రతిఫలం ఇస్తా... రూ.లక్షకు నెలకు రూ.పదివేలు, రూ.10 లక్షలకు నెలకు రూ.లక్ష లాభం చూపిస్తానంటూ అమాయక ప్రజలకు ఆశ చూపి పెద్దమొత్తంలో కుచ్చుటోపీ పెట్టిన ఒక సంస్థ విస్సన్నపేటలో బోర్డు తిప్పేసింది. విస్సన్నపేట శ్రీనివాస నగర్‌లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్‌ను 2023లో ఏర్పాటు చేశారు. గత రెండేళ్లుగా విస్సన్నపేట, పరిసర ప్రాంతాల ప్రజలకు క్రిప్టో కరెన్సీ, షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని, మీకు అత్యధిక లాభాలు చూపిస్తానని నమ్మబలికి సుమారు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లవరకు ప్రజల నుంచి దండుకున్నారు. సంస్థ డైరెక్టర్ నండూరి శివ నాగదుర్గాప్రసాద్, అతని భార్య శివాని కొద్దినెలల పాటు పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు చూపించారు. గత కొద్దికాలంగా సంస్థ తాళాలు తీయకపోవడం, రెండు నెలల క్రితం భవనం ఖాళీ చేయడంతో ఆ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు లబోదిబోమంటున్నారు.
డిపాజిట్‌దారుల వత్తిడితో డైరెక్టర్ ఆత్మహత్య
తాము పెట్టే పెట్టుబడికి అధిక మొత్తం చెల్లిస్తామని నమ్మించిన దుర్గాప్రసాద్ దంపతులు తీరా బోర్డు తిప్పేయడంతో వారిని నమ్మి డబ్బులు డిపాజిట్ చేసిన బాధితులు తీవ్ర ఆందోళనకు గురై తమ సొమ్ము ఇవ్వవలసిందిగా వత్తిడి చేయడంతో నెల క్రితం ఆ సంస్థ డైరెక్టర్ శివనాగ దుర్గాప్రసాద్ అత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన భార్య శివానీ కూడా కొద్దిరోజులుగా అదృశ్యమవడంతో పెట్టుబడిదారులు కంగుతిన్నారు. పిల్లల పెళ్లిళ్లకు, భవిష్యత్ అవసరాలకు అక్కరకు వస్తాయని ఆశించి దాచుకున్న డబ్బులను ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధితులు ఒక్కొక్కరుగా తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విస్సన్నపేట పరిసర ప్రాంతాల వారే కాకుండా గన్నవరం, మచిలీపట్నం, ఉయ్యూరు, విజయవాడ తదితర ప్రాంతాలలో కూడా అధికసంఖ్యలో బాధితులున్నారు. శనివారం వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. అయితే విస్సన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
అధిక మొత్తం ఆశ చూపి కుచ్చుటోపీ!
అధిక మొత్తం ఆశ చూపి కుచ్చుటోపీ!


