లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి
చిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్వరం కేసులు పరిష్కరించుకోవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్‌లో శనివారం జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 49 బెంచ్‌లను ఏర్పాటు చేశామన్నారు.
43,824 కేసులు పరిష్కారం
జాతీయ లోక్‌అదాలత్‌లో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆయా కోర్టుల్లో 43,824 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి తెలిపారు. ఈ లోక్‌అదాలత్‌లో 38,525 క్రిమినల్ కేసులు, 331 సివిల్ కేసులు, 1313 చెక్‌బౌన్స్ కేసులు పరిష్కరించారన్నారు. 142 మోటారు వాహన ప్రమాద క్లయిమ్‌లకు గానూ రూ.9.85 కోట్లు నష్టపరిహారంగా ఇచ్చేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయన్నారు. 3,513 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించి అవార్డులు జారీ చేశామన్నారు. మచిలీపట్నంలోని కోర్టుల్లో 7,449 కేసులు, విజయవాడ కోర్టుల్లో 11,964, గుడివాడ 6594, నందిగామ 3334, నూజివీడు 2340, మైలవరం 1892, జగ్గయ్యపేట 927, బంటుమిల్లి 734, కై కలూరు 684, తిరువూరు 3340, గన్నవరం 1668, అవనిగడ్డ 1541, మొవ్వ 673, ఉయ్యూరు కోర్టులో 684 కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


