అవనిగడ్డలో బుక్ కీపర్ ఘరానా మోసం
డ్వాక్రా మహిళల పొదుపు, లోన్‌కు కట్టాల్సిన రూ.25 లక్షలకు పైగా మోసం చేసి పరార్ డబ్బులు కట్టాలని బ్యాంకుల నుంచి డ్వాక్రా మహిళలకు ఫోన్లు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసినా ఇంతవరకూ చర్యలు లేవు బాధిత మహిళల ఆందోళనతో ఆలస్యంగా వెలుగులోకి...
అవనిగడ్డ: అవనిగడ్డ శివారు లంకమ్మ మాన్యంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి పొదుపు, లోన్లకు కట్టాల్సిన రూ.25 లక్షల సొమ్మును బుక్ కీపర్ స్వాహా చేసి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగక పోవడంతో శనివారం బాధిత మహిళలు నిరసన తెలిపారు.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పంచాయతీ పరిధిలోని లంకమ్మ మాన్యంకు చెందిన భాగ్యశ్రీ స్వయం సహాయక సంఘం అధ్యక్షురాలుగా ఉన్న విశ్వనాథపల్లి నాగమల్లేశ్వరి 23 డ్వాక్రా గ్రూపులకు బుక్ కీపర్‌గా పనిచేస్తోంది. భాగ్యశ్రీ గ్రూపు సభ్యులు నాలుగేళ్ల క్రితం రూ.20 లక్షలు యూనియన్ బ్యాంకు నుంచి లోను తీసుకున్నారు. వీటికి సంబంధించి ప్రతినెలా పొదుపు, లోను చెల్లిస్తుండగా మరో ఏడు నెలలు చెల్లిస్తే పూర్తిగా చెల్లింపులు జరిగినట్టవుతుంది. ఒక్కో సభ్యురాలు రూ.30వేలు కడితే లోను పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో గత నెల 11వ తేదీ నుంచి నాగమల్లేశ్వరితో పాటు ఆమె భర్త, పిల్లలు కనబడకుండా వెళ్లిపోయారు. దీంతో బ్యాంకుకు వెళ్లి స్టేట్‌మెంట్ తీయగా ఇంకా రూ.8.50 లక్షలు కట్టాలని చెప్పడంతో కంగుతిన్నారు. లంకమ్మ మాన్యంకు చెందిన మరియా ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులు గతంలో రూ.15లక్షలు ఇండియన్ బ్యాంకు నుంచి లోను తీసుకున్నారు. ప్రతినెలా నాగమల్లేశ్వరికే ఈ గ్రూపు సభ్యులు లోను, పొదుపు డబ్బులు ఇచ్చేవారు. ఎనిమిది నెలల క్రితమే ఈ సభ్యులు తీసుకున్న లోను తీర్చేశారు. అప్పటి నుంచి మరో లోను ఇప్పిస్తానని చెప్పి వీరి వద్ద నుంచి మరికొంత సొమ్ము తీసుకుంది. ఈమె కనిపించకుండా పోయిన తరువాత ఈ గ్రూపు సభ్యులు బ్యాంకుకు వెళ్లి స్టేట్‌మెంట్ తీయిస్తే రూ.6.35 లక్షలు కట్టాలని చెప్పడంతో అవాక్కయ్యారు. నాగమల్లేశ్వరి కోడలు సెక్రటరీగా ఉన్న యాసిన్ గ్రూపు సభ్యులు గతంలో ఒక్కొక్కరు రూ.2 లక్షలు లోను తీసుకున్నారు. ఈ గ్రూపునకు సంబంధించి నాలుగు నెలల పొదుపు, లోను డబ్బులు నాగమల్లేశ్వరికి ఇవ్వగా వాటిని బ్యాంకుకు చెల్లించలేదు.
ఫోర్జరీ సంతకాలతో శ్రీనిధి లోను
భాగ్యశ్రీ గ్రూపు ప్రెసిడెంట్‌గా ఉన్న విశ్వనాథపల్లి నాగమల్లేశ్వరి సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి రూ.2లక్షలు శ్రీనిధి లోను తీసుకుంది. బ్యాంకుకు వెళ్లినపుడు ఈ విషయం తెలియడంతో బాధిత మహిళలు లబోదిబో మంటున్నారు. అదికాక యాసిన్ గ్రూపు నుంచి సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి మరో రూ.3లక్షలు లోను తీసుకుంది. ఇలా ఇప్పటివరకూ ఈ మూడు గ్రూపుల నుంచి రూ.25 లక్షలకు పైగా సొమ్మును స్వాహా చేసినట్టు లెక్కలు తేలాయి. మూడు గ్రూపుల నుంచే ఇంత సొమ్ము స్వాహా చేస్తే, ఆమె బుక్ కీపర్‌గా ఉన్న మరో 20 గ్రూపుల పరిస్థితి ఏమిటోనని ఆయా గ్రూపుల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నాగమల్లేశ్వరి మొత్తం 23 గ్రూపులకు బుక్‌కీపర్‌గా ఉండగా ఇంకెన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.
కలెక్టర్, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా...
ఈ విషయమై గత నెల 14వ తేదీన అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లో బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. 15వ తేదీన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు, 17వ తేదీన కలెక్టర్ డీకే బాలాజీకి కూడా ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకూ న్యాయం జరగకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పొదుపు, లోను డబ్బులు కట్టక పోవడంతో ఇప్పటికే బ్యాంకులు రూ.2లక్షలు పొదుపు సొమ్ము జమ వేసుకుందని, మరిన్ని డబ్బులు జమ వేసుకోక ముందే కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు కోరుతున్నారు.


