భక్తి ప్రకాశం.. అరుణోదయం
ఆద్యంతం.. ఆధ్యాత్మిక పరవశం..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలా ద్రిపై దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు రెండో రోజుకు చేరుకోగా.. శుక్రవారం సుమారు 80 వేల మంది భవానీలు, భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున 1.15 గంటలకు అమ్మవారికి నిత్య పూజల అనంతరం భవానీ దర్శనానికి అనుమతించారు. గురువారం రాత్రి నగరానికి చేరుకున్న భవానీలు గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని, క్యూలైన్‌లోనే వేచి ఉండటం కనిపించింది. వేకువజామునే అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్న భవానీలు, కొండ దిగువకు చేరుకుని ఇరుముడులను సమర్పించారు. అనంతరం ఇరుముడిలోని నేతి కొబ్బరి కాయను హోమగుండానికి అర్పించి దీక్షను పరిపూర్ణం చేసుకున్నారు. దీక్ష విరమించిన భవానీలు లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 11 గంట వరకు భవానీలకు అమ్మవారి దర్శనం కల్పించారు. భవానీలతో పాటు సాధారణ భక్తుల రద్దీ అధికంగా కనిపించింది.
నేడు, రేపు కీలకం..
భవానీ దీక్ష విరమణలలో శనివారం, ఆదివారం అత్యంత కీలకమని ఆలయ అధికారులు భావిస్తున్నారు. రెండో శనివారం, ఆదివారాల నేపథ్యంలో భవానీలు భారీగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
భవానీలు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. కుమ్మరి పాలెం మొదలు బ్రాహ్మణ వీధి, రథం సెంటర్ వరకు పలు ప్రధాన కూడళ్లు, అపార్టుమెంట్లు, భవన సముదాయాల వద్ద పలు భక్త బృందాలు, సేవా బృందాలు అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసే భవానీలకు అల్పాహారం, పాలు, పండ్లు, ఫలాలను అందిస్తూ సేవలు చేస్తున్నారు. దుర్గగుడి ఈవో శీనానాయక్ గిరిప్రదక్షిణ మార్గంలో బైక్‌పై తిరుగుతూ భవానీలతో మాట్లాడారు. ఇబ్బందులు, సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఈవో వెంట ఈఈ రాంబాబు పాల్గొన్నారు.


