అన్నను హత్య చేసిన తమ్ముడి అరెస్ట్
గుడివాడరూరల్: ఆస్తి తగదాల నేపథ్యంలో అన్నను హత్య చేసిన తమ్ముడిని అరెస్ట్ చేశామని గుడివాడ రైల్వే సీఐ ఎంవీ దుర్గారావు ఆదివారం తెలిపారు. రైల్వే పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. ఈ నెల 3న గుడివాడ రైల్వేస్టేషన్ సమీపంలోని ధనియాలపేట వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని సమాచారం వచ్చిందన్నారు. రైల్వే ఎస్‌ఐ, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని చెప్పారు. రైల్వే డీఎస్పీ రత్నరాజు ఆదేశాల మేరకు తన పర్యవేక్షణలో మచిలీపట్నం, గుడివాడ రైల్వే ఎస్‌ఐలు మహబూబ్ షరీఫ్, శివనారాయణలను తమ సిబ్బందితో విచారణ ప్రారంభించామన్నారు. రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించి సీసీ కెమెరాలు, సెల్ టవర్ డంప్, సీడీఆర్, ఫోన్‌పేల ఆధారాలను సేకరించామన్నారు. బిహార్‌కు చెందిన సోనూకుమార్ సహనీ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి మందపాడు ఎల్‌ఐసీ కార్యాలయ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
రైల్వే సిబ్బందికి అభినందన..
నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం బిహార్‌లో తన అన్న పప్పుసహానీ(28)తో ఆస్తి విషయంలో మనస్పర్థలు ఉన్నాయన్నారు. ఈనేపథ్యంలో ఇటీవల గుడివాడ మండలం చిన ఎరుకపాడు వద్ద సీడ్ కంపెనీలో పనికి చేరానని, తన అన్న పనుల నిమిత్తం మైసూర్ వెళ్లాడన్నారు. ఈక్రమంలో తన అన్న మైసూర్‌లో పనులు చేసేందుకు కూలీలు అవసరమయ్యారని తెలపగా తాను గుడివాడలో కూలీలు ఉన్నారని తీసుకువెళ్లేందుకు తన అన్నను రావాలని కోరానన్నారు. ఈక్రమంలో ముందుగానే తాను వేసుకున్న పథకం ప్రకారం తన అన్న ఈ నెల 3న తెల్లవారు జామున గుడివాడ రాగానే ధనియాలపేట వద్దకు తీసుకెళ్లి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడన్నారు. వారం రోజుల్లోనే హత్య కేసును చేధించిన రైల్వే ఎస్‌ఐలు మహబూబ్ షరీఫ్, శివనారాయణ, ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ షేక్ అక్బర్, సిబ్బందిని సీఐ ప్రత్యేకంగా అభినందించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.


