తృటిలో తప్పిన పెను ప్రమాదం
జి.కొండూరు: జి.కొండూరు మండల పరిధి కవులూరు గ్రామ శివారులో ఉన్న ఎన్‌సీఎల్ బ్రిక్స్ కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. కంపెనీలో ప్రధాన భాగమైన 250 టన్నుల బరువుతో ఉండే భారీ ఫ్లైయాష్ ట్యాంకు ఆదివారం మధ్యాహ్న సమయంలో కూలిపోయింది. భోజన విరామంలో ఈ ప్రమాదం జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఈ కంపెనీలో షిఫ్ట్‌కు 40 మంది చొప్పున మూడు షిఫ్ట్‌లలో రోజుకు 120 మంది కార్మికులు పని చేస్తూ ఉంటారు. ప్రమాద సమయంలో కూడా 40 మంది కార్మికులు విధులలో ఉన్నప్పటికీ భోజన విరామం కావడంతో పెను ప్రమాదం తప్పింది. గత ఆరేళ్లుగా ఇప్పటి వరకు ఇది మూడో ప్రమాదంగా తెలుస్తోంది. గతంలో జరిగిన రెండు ప్రమాదాల్లో ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. యాజమాన్య నిర్లక్ష్యంతో నిర్వహణ లోపం వల్లనే ఈ ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. యంత్రాలను మెయింటెనెన్స్ చేయాలని సిబ్బంది చెప్పినప్పటికీ యాజమాన్యం వారి మాటలను పెడచెవిన పెట్టి ఉత్పత్తిపైనే దృష్టి సారించడం వల్లన ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్మికుల భద్రతను గాలికొదిలేసి ఉత్పత్తిపైనే దృష్టి సారించిన ఎన్‌సీఎల్ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం ఇదే తీరు కొనసాగిస్తే కార్మికులతో కలిసి కంపెనీ ఎదుట ధర్నాకు దిగుతామని నాయకులు హెచ్చరించారు.
ఎన్‌సీఎల్ బ్రిక్స్ కంపెనీలో కూలిన భారీ ఫ్లైయాష్ ట్యాంకు


