పర్యాటకులకు తప్పని నిరాశ..!
కోడూరు: హంసలదీవి సాగర తీరంలో కార్తిక స్నానాలు ఆచరించేందుకు వచ్చిన పర్యాటకులకు నిరాశ తప్పలేదు. అటవీ అధికారులు పాలకాయతిప్ప కరకట్ట వద్ద గేటు ఏర్పాటు చేసి పర్యాటకుల రాకపోకలపై నియంత్రణ ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు గేటు తెరిచి సాయంత్రం 5 గంటలకు మళ్లీ గేటును మూసివేస్తున్నారు. అయితే కార్తిక మాసంతో సూర్యోదయ వేళ పుణ్యస్నానం చేస్తే ముక్తి లభిస్తుందనే ఆశతో హైదరాబాద్, నల్లగొండ, వరంగల్, ఖమ్మంతో పాటు విజయవాడ, గుంటూరుకు చెందిన పర్యాటకులు ఉదయం 6 గంటలకే కరకట్ట గేటు వద్దకు చేరుకున్నారు. ఉదయం వేళ స్నానాలకు అనుమతి లేదని అటవీ అధికారులు వీరందరినీ పాలకాయతిప్ప బీచ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఉదయం 9 గంటల వరకు పర్యాటకులను అనుమతించమని అటవీ అధికారులు స్పష్టం చేశారు. హంసలదీవి సాగరతీరంలో వేకువజామున ఎన్నో ప్రకృతి రమణీయ దృశ్యాలు, సూర్యోదయ సుందర దృశ్యాలు కనిపిస్తున్నాయని, అటవీ అధికారులు నిబంధనలు పెట్టి వీటికి పర్యాటకులను దూరం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అటవీ అధికారుల తీరు వల్ల సాగరతీరం విశిష్ట దెబ్బతింటుందని, కార్తిక మాసంలో అయినా అధికారులు నిబంధనలు సడలింపు ఇవ్వాలని పర్యాటకులు కోరుతున్నారు.


