‘క్రీడలను కాపాడుకుందాం – యువతను రక్షించుకుందాం’
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఇటీవల జరిగిన మహిళా క్రికెట్ ప్రపంచకప్‌లో మన జట్టు దేశానికి అద్భుతమైన విజయాన్ని అందించిందని, అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో క్రీడలను కాపాడుకుందాం – యువతను రక్షించుకుందాం అని వక్తలు పిలుపునిచ్చారు. గవర్నర్‌పేట, రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్‌లో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము అధ్యక్షతన ఆదివారం మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేతలను అభినందిద్దాం–క్రీడా అభివృద్ధిపై చర్చిద్దాం అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ ప్రపంచకప్‌లో ఒక్కో మహిళా అగ్గిపిడుగులై గర్జించారని కొనియాడారు. భవిష్యత్తులో మహిళా క్రీడాకారులకు ఇది ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. యువతను డ్రగ్స్, గంజాయి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో క్రీడలకు మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని, తగినంత కోచ్‌లు లేరని చెప్పారు. హర్యానా లాంటి రాష్ట్రంలో 400మంది కోచ్‌లు ఉంటే మన రాష్ట్రంలో నలుగురు మాత్రమే ఉన్నారన్నారు. మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాకు స్పోర్ట్స్ పాఠశాల, స్పోర్ట్స్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. మహిళా క్రీడాకారులకు రక్షణ కల్పించడంతో పాటు జీవో నంబర్ 74ను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కోచ్ ప్రసాద్, లెక్చరర్ ఎస్.లెనిన్‌బాబు, జేవీవీ, డీవైఎఫ్‌ఐ నాయకులు శ్రీను, శోభన్, రవి, రమణ, శివ, పి.కృష్ణ, నరసింహ, ప్రసాద్, కృష్ణకాంత్ పాల్గొన్నారు.


