దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారిని నిర్వహించిన ఖడ్గమాలార్చన మొదలు శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కళ్యాణంలో పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కానుకలను సమర్పించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని క్యూలైన్లు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. సర్వ దర్శనంతో పాటు రూ.100, రూ.300, రూ.500 టికెట్లు క్యూలైన్‌లోనూ రద్దీ కనిపించింది. సాయంత్రం పంచహారతుల సేవలోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మల్లేశ్వర స్వామి వారికి త్రికాల అర్చనలు, అభిషేకాలను నిర్వహించారు. సాయంత్రం సహాస్ర లింగార్చన సేవ, సహాస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవలు నిర్వహించారు. ఊంజల్ సేవలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.


