సమ్మోహనం.. ధర్మ విజయం
విజయవాడకల్చరల్: గౌతమ బుద్ధుని జీవిత విశేషాల సమాహారంగా సాగిన నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. జయశ్రీ నృత్య కూచిపూడి నృత్యాలయం ఆధ్వర్యంలో నాట్యాచార్యుడు చదలవాడ ఆనంద్ నృత్య దర్శకత్వంలో విజయవాడ గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో శనివారం ప్రదర్శించిన ధర్మవిజయం నృత్య రూపకం సమ్మోహనంగా సాగింది. భారతీయుల ఆధ్యాత్మిక గురువు బుద్ధుని జీవిత విశేషాలతో కూడిన ఈ కళా రూపానికి తియ్యగూర సీతారామిరెడ్డి కథా సహకారం అందించగా కుమార సూర్యనారాయణ సంగీత సహకారం అందించారు. సిద్ధార్థుని జననంతో ప్రారంభించి ఆయన బాల్యం, కౌమారం, యవ్వనం, వివాహం సిద్ధార్థుడు బుద్ధునిగా మారడం, ఆయన ధర్మబోధనలు అంశంగా ప్రదర్శన సాగింది. సిద్ధార్థునిగా నాదపద్మ, గౌతమునిగా ద్వారక జయలక్ష్మి, శమహారాజుగా ద్వారక జయలక్ష్మి, మాయా దేవిగా భవ్యశ్రీ, యశోదరగా అమృత వర్షిణి, బింబిసారునిగా భవ్యశ్రీలు నటించారు. విద్యావేత్త గంధసిరి కల్పనను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రచయితలు తియ్యగూర సీతారామిరెడ్డి, మెండెపు శ్రీనివాస్ గాయని సుధా శ్రీనివాస్, సంగీత విద్వాంసురాలు కందుల లక్ష్మీనరసమ్మ, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ సి.జ్యోతిర్మయి పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ‘బుద్ధ చరితం’ నృత్య రూపకం


