కూటమి నేతల్లో కోడి పందేల కోల్డ్‌ వార్‌ | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతల్లో కోడి పందేల కోల్డ్‌ వార్‌

Nov 9 2025 7:15 AM | Updated on Nov 9 2025 7:17 AM

కూటమి నేతల్లో కోడి పందేల కోల్డ్‌ వార్‌

శిబిరం కోసం నేతల పట్టు..

కంకిపాడు: సంక్రాంతికి మూడు నెలల ముందే కోడి పందేల లొల్లి మొదలైంది.. పండుగ మూడు రోజులూ జూద శిబిరాలు అడ్డగోలుగా నిర్వహించి పైసా వసూలు చేసుకునేందుకు టీడీపీ, జనసేన పక్షాలు రెడీ అయ్యాయి. ఎక్కడెక్కడ శిబిరాలు ఏర్పాటు చేయాలనే అంశంపై ఇరుపక్షాలు నడుమ ఒప్పందాలు కుదరకపోవటంతో కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. పండుగ మూడు రోజుల్లో భారీ స్థాయిలో పందేలు నిర్వహించేందుకు అవసరమైన సన్నాహాల్లో నేతలు బిజీ అయ్యారు. సంక్రాంతి పండుగ అనగానే గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణాజిల్లా వ్యాప్తంగా నిర్వహించే జూద శిబిరాలు పోటీ పడుతున్నాయి. అందులోనూ పెనమలూరు నియోజకవర్గంలో భారీ సెట్టింగులతో ఏర్పాటు చేసే కోడిపందేలు, జూద శిబిరాలు పందేల రాయుళ్లను ఆకర్షిస్తుంటాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, కర్నాటకతో పాటుగా ఇతర దేశాలు, సినీరంగ ప్రముఖులు సైతం పాల్గొనేందుకు ఈప్రాంతానికి వస్తుండటం గమనార్హం. గత ఏడాది నియోజకవర్గం వ్యాప్తంగా నిర్వహించిన బరుల్లో సుమారు రూ.300 కోట్లు పైగా టర్నోవర్‌ జరిగినట్లు అంచనా. ఈ దఫా గత టర్నోవర్‌ను అధికమించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో నియోజకవర్గం వ్యాప్తంగా ఏర్పాటు చేసే జూద శిబిరాలపై టీడీపీ, జనసేన పక్షాలు కన్నేశాయి. ప్రధానంగా పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో డిమాండ్‌ అధికంగా ఉన్న జూద శిబిరాలను చేజిక్కించుకుని పండుగ మూడు రోజులూ దండుకునేందుకు నేతలు స్కెచ్‌ గీసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా టీడీపీ, జనసేన పక్షాలు వేరువేరుగానే బరులు ఏర్పాటు చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి.

స్టార్‌ హోటళ్లలో సిట్టింగులు..

కోడి పందేలు, జూద శిబిరాల నిర్వహణ అంశంపై టీడీపీ, జనసేనపక్షాలు జూదరులు, పందెం రాయుళ్లతో అప్పుడే ఒప్పందాలు మొదలు పెట్టారు. స్టార్‌ హోటళ్లలో సిట్టింగులు ఏర్పాటు చేసుకుంటున్నారు. రూ 2 లక్షలు నుంచి రూ 5 లక్షలుపైగా కోడి పందేలు బరుల్లో నిర్వహించటంపై ఒప్పందాలు చేసుకుంటున్నారు. అంతే కాకుండా కోత ముక్క, లోన–బయట, చిన్న బజారు–పెద్ద బజారు ఇతర జూదాలను హోల్‌సేల్‌గా విక్రయించేందుకు లక్షల్లో బేరాలు పెట్టారు. జూదరులను ఆకర్షించేందుకు వారికి పండుగ మూడు రోజులూ వసతి, ఇతర సదుపాయాలను కల్పిస్తామన్న హామీతో అగ్రిమెంట్లు చేసుకోవటం గమనార్హం. ఒక చోట జరిగిన ఒప్పందాలపై మరో చోట శిబిరం నిర్వాహకులు సమాచారం తెలుసుకుని తమ శిబిరంలో జూద నిర్వహిస్తే ఎక్కువ ప్రయోజనం కల్పిస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారంటే పండుగ సందర్భంగా ఏ మేరకు డబ్బులు వెనుకేయాలనే ఆలోచనలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు కేంద్రంగా ఉన్న ప్రధాన హోటళ్లు, లాడ్జిల్లో పండుగ రూములు బుకింగ్‌ జరిగాయంటే ఈ దఫా బరుల నిర్వహణలో టీడీపీ, జనసేన పక్షాల నేతల ఆరాటం స్పష్టం చేస్తోంది.

పెద్ద పండుగకు మూడు నెలల ముందే మొదలైన పందేల హడావుడి

జూద శిబిరాల నిర్వహణకు నేతల ఆరాటం

పైసా వసూల్‌కు స్కెచ్‌ రెడీ చేసుకుంటున్న టీడీపీ, జనసేన పక్షాలు

బరుల ఒప్పందాలు కుదరక మల్లగుల్లాలు

పెనమలూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఏటా పది నుంచి 15 వరకూ బరులు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ పక్షాలు వేరువేరుగా బరులు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ దఫా కూడా వేరుగానే బరులు ఏర్పాటు చేయాలనే తలంపు, పట్టుతో ఉన్నాయి. నియోజకవర్గ ముఖ్యనేతతో ఒప్పందం కూడా చేసుకుని ఎవరికి ముట్టచెప్పేది వారికి ముట్టజెప్పి బరులు ‘ఓకే’ చేయించుకుంటున్నారు. అందుకుగానూ పెట్టుబడులు సమకూర్చుకుంటున్నారు. ‘రాయల్టీ’ ఆశించిన ఆ ముఖ్యనేత, ఆయన ప్రధాన అనుచరులు పైస్థాయి పైరవీలు చేసుకుంటున్నారు. బరుల్లో తమ అనుచర వర్గమే పందేలు, జూద శిబిరాలు పెట్టి భారీ స్థాయిలో సంక్రాంతి మూడు రోజులూ దండుకునే కార్యక్రమానికి రంగం సిద్ధం చేసుకుని పావులు కదుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement