భవానీ భక్తులకు త్వరితగతిన దుర్గమ్మ దర్శనం | - | Sakshi
Sakshi News home page

భవానీ భక్తులకు త్వరితగతిన దుర్గమ్మ దర్శనం

Nov 9 2025 6:45 AM | Updated on Nov 9 2025 6:45 AM

భవానీ భక్తులకు త్వరితగతిన దుర్గమ్మ దర్శనం

భవానీ భక్తులకు త్వరితగతిన దుర్గమ్మ దర్శనం

● భవానీ దీక్షల విరమణపై అధికారుల సమీక్ష ● సీపీ కార్యాలయంలో దుర్గగుడి, పోలీసు అధికారుల భేటీ ● భవానీ భక్తుల రిజిస్ట్రేషన్‌ కోసం యాప్‌ ఆధునికీకరణ ● అవసరమైన ప్రదేశాల్లోఫుట్‌ బ్రిడ్జిల ఏర్పాటుకు నిర్ణయం

లబ్బీపేట(విజయవాడతూర్పు): డిసెంబర్‌ 11 నుంచి 15 వరకు భవానీ దీక్షల విరమణ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు చర్యలపై దుర్గగుడి అధికారులు, పోలీసు అధికారులతో పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. భవానీ మాలధారులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా త్వరితగతిన దుర్గమ్మ దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన ప్రదేశాల్లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల ఏర్పాటుపై చర్చించారు. భవానీ భక్తులందరూ ప్రత్యేక యాప్‌లో పేర్లు నమోదు చేసుకునేలా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. దీక్ష విరమణకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారని, అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

రద్దీని నియంత్రించి..

హోల్డింగ్‌ ఏరియాలను ఉపయోగించి, క్యూలైన్లు, స్నానఘాట్లు, ప్రసాదం కౌంటర్ల వద్ద భక్తుల రద్దీని తగ్గించి త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. గిరి ప్రదక్షిణ సమయంలో భవానీ భక్తులకు ఆటంకాలు ఎదురవకుండా, సామాన్య ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై క్షుణ్ణంగా చర్చించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, గిరి ప్రదక్షిణ సమయంలో ట్రాఫిక్‌ నిర్వహణ, బందోబస్‌ ఏర్పాట్లపై సమీక్షించారు. భవానీ భక్తుల సమాచారం కోసం గత ఏడాది రూపొందించిన ప్రత్యేక యాప్‌ ఆధునికీకరించి, దానిలో అమ్మవారి దర్శనం వివరాలు, ముందస్తు సమాచారం, ప్రసాదాలను ఆన్‌లైన్‌ ద్వారా ముందుగానే బుక్‌చేసుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పార్కింగ్‌ ప్రదేశాలు, మెడికల్‌ పాయింట్లు, తాగునీరు, సమాచార కేంద్రం, గిరి ప్రదక్షిణ, దర్శన సమయాలు, పూజా విధానం తదితర అంశాలన్నీ ఆ యాప్‌లో ఉండేలా చూడాలని దేవస్థానం ఐటీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈఓ శీనానాయక్‌, డీసీపీ కృష్ణకాంత్‌ పాటిల్‌, ఏడీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఐ గురుప్రకాష్‌, దేవస్థానం అధికారులు, ఐటీ, ఇంజినీరింగు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement