సర్కారు కొర్రీ.. రైతన్న వర్రీ.. | - | Sakshi
Sakshi News home page

సర్కారు కొర్రీ.. రైతన్న వర్రీ..

Nov 3 2025 6:50 AM | Updated on Nov 3 2025 6:50 AM

సర్కారు కొర్రీ.. రైతన్న వర్రీ..

సర్కారు కొర్రీ.. రైతన్న వర్రీ..

సర్కారు కొర్రీ.. రైతన్న వర్రీ..

అకాల వర్షాలు, తుపానుతో రైతులకు అపార నష్టం పెట్టుబడులు కోల్పోయామంటూ ఆవేదన సగమైనా దిగుబడి చేతికి దక్కదంటూ ఆందోళన నష్ట పరిహారం రాస్తే ధాన్యం కొనుగోలు చేయబోమంటూ మెలిక ఇదేనా రైతు సంక్షేమం అంటున్న అన్నదాతలు

ముందుగానే చెబుతున్నాం

పంట కొనుగోలు చేయాల్సిందే

కంకిపాడు: కూటమి సర్కారు రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలు ఈ ఆరోపణలు, విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. ఆపదలో ఆదుకోవాల్సిన సర్కారు నిర్లక్ష్యం కనబర్చటంతో అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. తుపానుతో పంట నష్టపోయి పెట్టుబడులు కోల్పోయి ఆందోళన చెందుతున్న తరుణంలో రైతులపై మరో పిడుగు పడినట్లయింది. పంట నష్టపరిహారం నమోదు చేస్తే ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదంటూ అధికారులు చెబుతున్న మాటలే ఇందుకు కారణం. పంటపై పెట్టిన పెట్టుబడులతో పోలిస్తే అరకొర సాయంతో చేతులు దులుపుకుంటూ ఆఖరికి ధాన్యం కొనుగోలు చేయకపోతే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇలా.....

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 1.54 లక్షల హెక్టార్లలో వరి, 24 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగయ్యాయి. అరటి, కంద, పసుపు, తమలపాకు, కూరగాయలు, బొప్పాయి, ఇతర పంటలు సైతం ఉన్నాయి. ప్రధానంగా వరి పంట ప్రస్తుతం చేతికొచ్చే తరుణం. మరో పది రోజుల్లో వరి కోతలు ప్రారంభమై ధాన్యం మార్కెట్‌కు చేరుతుంది. ఇప్పటికే ఒక్కో రైతు ఎకరాకు రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకూ పెట్టుబడులు పెట్టి దిగుబడి కోసం ఆశగా ఉన్న తరుణం.

అకాల వర్షాలు, తుపానుతో నష్టం....

ఈ ఏడాది అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా నష్టపరిచాయి. దీనికి తోడు పంట చేతికొచ్చే సమయంలో మోంథా తుపాను విరుచుకుపడింది. జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో 427 గ్రామాల్లో 56,040 మంది రైతులు 46,357 హెక్టార్లలో పంటలు దెబ్బతిని తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ప్రత్యేకించి 54,180 మంది రైతులకు చెందిన 45,040 హెక్టార్లలో వరి పంట నేలవాలింది. వరిపైరు చిరుపొట్ట, కంకులు గట్టిపడే దశలో ఉన్నాయి. ఈ సమయంలో తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో పైర్లు నేలవాలి కంకులు రాలి, సుంకు దెబ్బతినటంతో పాటుగా మడమ తాలు, తాలు, తప్ప ఏర్పడ్డాయి. మానుగాయ, పాకుడుతో పంటకు నష్టం వాటిల్లుతోంది. పంటపై పెట్టిన పెట్టుబడులు చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 45 బస్తాల వరకూ దిగుబడులు వస్తాయని ఆశించిన రైతులు నేడు కనీసం 20 బస్తాలైనా చేతికొస్తాయో? లేదో? అన్న ఆందోళనలో మునిగిపోతున్నారు. ఆ దిగుబడులతో కౌలు డబ్బులే కట్టాలో?, పెట్టుబడులే చూసుకోవాలో అర్థం కావటం లేదంటూ వాపోతున్నారు.

అప్పుడే నిబంధనల కొర్రీ....

తుపాను గాయం నుంచి రైతులు ఇంకా కోలుకోకముందే ప్రభుత్వం విధించే నిబంధనల కొర్రీతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పంట నష్టపరిహారం నమోదు చేయించుకునే రైతుల నుంచి రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉండదంటూ అధికారులు తేల్చి చెబుతున్నారు. అంతకు ఇష్టమైతేనే పేర్లు నమోదుచేయించుకోమంటూ చెప్పటం గమనార్హం. దీంతో పంటలో సగం దిగుబడి వచ్చినా ఆ పంటను ఎక్కడ అమ్ముకోవాలనే ప్రశ్న తలెత్తటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తాలు తప్ప వచ్చి పంట పోయినా మిగిలిన పంటకై నా మద్దతు ధర దక్కితే పెట్టుబడులు చేతికి రాకపోయినా కౌలు చెల్లింపు సజావుగా సాగుతుందన్న ఆశాభావంతో అన్నదాతలు ఉన్నారు. నష్టపరిహారం నమోదు సమయంలోనే నిబంధనల పేరుతో తిరకాసు పెట్టడం, వ్యవసాయ సహాయకులు గ్రామస్థాయిలో ఈ విషయాన్ని ఘంటాపథంగా చెప్పటంతో రైతులకు దిక్కుతోచటం లేదు. ప్రభుత్వం అందించే అరకొర సాయంతో సరిపెట్టుకునేందుకు కొందరు రైతులు వెనుకాడుతున్నారు. వచ్చిన కాస్త దిగుబడిని మద్దతుకు అమ్ముకుంటామని చెబుతున్నారు.

పంట నష్టపరిహారం అందించిన తరువాత పంట దిగుబడులు కొనుగోలు సాధ్యం కాదు. గతంలోనూ ఇదే జరిగింది. ఈ సీజన్‌లో ఆ సమస్య తలెత్తకుండా ముందుగానే క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పంట దెబ్బతిన్నాక దిగుబడులు ఊసే ఉండదు. అయినా ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధిస్తుందో తెలీదు. నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.

–ఎన్‌.పద్మావతి, జిల్లా వ్యవసాయాధికారి, కృష్ణాజిల్లా

ప్రభుత్వం ఇచ్చే సాయం అరకొరే. అది కనీసం కూలీ ఖర్చులకు కూడా సరిపోదు. తుపాను నుంచి బయటపడ్డ మిగిలిన పంటను అమ్ముకునేందుకు అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలి. రైతులకు మద్దతు ధర దక్కేలా చేయాలి. లేకపోతే కౌలుచెల్లింపులు ఎలా సాధ్యం. ఇప్పటికే పెట్టుబడులు పూర్తిగా కోల్పోతున్నాం. రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలి.

– యలమంచిలి సత్యమోహన్‌, కౌలురైతు, గొడవర్రు, కంకిపాడు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement