దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆది దంపతులకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీ హోమం, శాంతి కల్యాణంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. మరోవైపున అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. సర్వ దర్శనం క్యూలైన్‌తో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెటు క్యూలైన్లలో భక్తుల తాకిడి కనిపించింది. భక్తుల రద్దీతో అమ్మవారి దర్శనంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
దుర్గాఘాట్‌లో రద్దీ...
కార్తిక మాసం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన యాత్రికులు, భక్తులు దుర్గాఘాట్‌లో పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కొంత మంది భక్తులు దేవస్థాన కేశకండనశాలలో తలనీలాలు సమర్పించిన అనంతరం నదీతీరంలో స్నానాలు ఆచరించి అనంతరం ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థాన ఘాట్‌రోడ్డుతో పాటు మహామండపం మెట్లు, లిప్టు మార్గం ద్వారా భక్తులు కొండపైకి చేరుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా మహా మండపం 5వ అంతస్తు వరకే లిప్టులను అనుమతించారు. అక్కడి నుంచి భక్తులు క్యూలైన్ల ద్వారా కొండపైకి చేరుకున్నారు.
లోక కళ్యాణార్ధం సూర్యోపాసన సేవ
దుర్గగుడిలో లోక కళ్యాణార్ధం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్యభగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా, పలువురు ఉభయదాతలు సేవలో పాల్గొన్నారు.
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ


