వెలకట్టలేని త్యాగం.. వెలుగులు నింపిన ప్రాణం
గుడివాడరూరల్: అవయవ దానం ద్వారా నలుగురు జీవితాల్లో చిరు వ్యాపారి వెలుగులు నింపి సజీవంగా నిలిచారు. పట్టణంలోని బంటుమిల్లిరోడ్డు పెద్ద మసీదు వద్ద నివసించే చిరు వ్యాపారి హరి విజయకుమార్ (46) బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానమిచ్చి ఆదర్శంగా నిలిచారు. మూత్రపిండం, కాలేయం మణిపాల్ ఆసుపత్రికి అందచేయగా విజయవాడలో అవసరమైన వారికి అవయవ మార్పిడి నిర్వహించారు. మరో కిడ్నీ విజయవాడ కామినేని హాస్పటల్‌కు, నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి తరలించారు. గత నెల 30వ తేదీన హరి విజయ్‌కుమార్ గుడివాడ నుంచి బ్యాంక్ పని నిమిత్తం మంగళగిరి వెళ్లారు. ఈక్రమంలో ఆయనకు ఆకస్మికంగా ఫిట్స్ రావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్‌లో తీవ్ర రక్తస్త్రావం అయిందని గుర్తించి మెరుగైన వైద్యం కోసం మణిపాల్ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు అవసరమైన పరీక్షలు చేసి బ్రెయిన్‌డెడ్ అని నిర్థారించారు. ఈ నేపధ్యంలో భార్య యోగవిష్ణు ప్రియ, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఏపీ జీవన్ దాన్ చైర్మన్ డాక్టర్ రాంబాబు, మణిపాల్ వైద్యశాల డైరెక్టర్ రామాంజనేయరెడ్డి పర్యవేక్షణలో అవయవదానం చేశారు. దాత కుటుంబానికి మణిపాల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. మరణించిన తర్వాత కూడా నలుగురు జీవితాల్లో వెలుగులు నింపిన విజయ్‌కుమార్ కుటుంబ సభ్యులను గుడివాడకు చెందిన సేవాతత్పరులు పలువురు ఆదివారం అభినందించారు. నేత్రదానం, రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విజయ్‌కుమార్ కుటుంబ సన్నిహితుడు దాసరి మహేష్ తెలిపారు. కష్టకాలంలో 10 మందికి మంచి చేయాలని మిత్రుడు విజయ్ కుటుంబ సభ్యులు చేసిన గొప్ప పనిని ఆయన అభినందించారు. జనసేన కార్యకర్త అయిన విజయ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఆయన కుటుంబ పరిస్థితి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని మహేష్ చెప్పారు.
బ్రెయిన్‌డెడ్ వ్యక్తి అవయవాల దానం చేసిన కుటుంబ సభ్యులు


