స్మృతివనం నిర్వహణపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): స్మృతివనం నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. మహనీయునికి విశిష్ట గౌరవం కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్.మల్లికార్జునరావు, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్‌ఎంలతో కలిసి సమన్వయ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనానికి సంబంధించిన అభివృద్ధి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ స్మృతివనం నిర్వహణలో ఎలాంటి అలసత్వానికి చోటులేదని చెప్పారు. ఇప్పటివరకు నిర్వహణ బాధ్యతలు చూసిన కాంట్రాక్టు సంస్థను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని ఆ సంస్థను ఆదేశించామని తెలిపారు. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. స్మృతివనం నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలకు అప్పగించిందని వెల్లడించారు. ఈ శాఖల ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా నిరంతర కృషి చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో విజయవాడ నగర పాలక సంస్థ, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు, ఏపీఐఐసీ, సాంఘిక సంక్షేమం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ


