చోరీ కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్టు
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్):దేవాలయంలో హుండి పగులకొట్టి నగదు చోరీతో పాటుగా ఆటో, ద్విచక్ర వాహనం దొంగిలించిన నిందితుడిని ఎస్‌ఎన్‌పురం పోలీసులు అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎస్‌వీవీ లక్ష్మీనారాయణతో కలసి నార్త్‌జోన్ ఏసీపీ డాక్టర్ స్రవంతి రాయ్ వివరాలు వెల్లడించారు.
దాసాంజనేస్వామి ఆలయంలో గత నెల 27న హుండీ పగులకొట్టి నగదు చోరీకి గురైనట్లు వచ్చి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరానికి పాల్పడింది ప్రకాశం జిల్లాకు చెందిన రామనబోయిన శ్రీనుగా గుర్తించి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు ఆదివారం రైల్వేస్టేషన్ సమీపంలోని బొగ్గులైన్ క్వార్టర్స్ వద్ద ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. విచారణలో నిందితుడు హుండీలో చోరీ చేసిన నగదులో కొంతభాగం బొగ్గు లైన్ క్వార్ట్‌ర్స్ వద్ద పొదల్లో దాచినట్లు చెప్పారు. మరికొంత సొమ్ముతో కర్నూలు బస్సు ఎక్కి వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. తన వద్ద ఉన్న సొమ్ము అయిపోవడంతో దాచిపెట్టుకున్న సొమ్మును తీసుకువెళ్లేందుకు బొగ్గు లైన్ క్వార్టర్స్‌కు రాగా పోలీసులు పట్టుకున్నారు. నిందితున్ని అరెస్టు చేసి రూ. 18వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆటో, ద్విచక్ర వాహనం చోరీ కేసులో ఎనికేపాడుకు చెందిన పెనుగోతు మురళిగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. చోరీకి గురైన ఒక ఆటో, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.


