
పత్రికా స్వేచ్ఛపై కాలకూటమి
ఎడిటర్‌పై అక్రమ కేసుల పరంపర పాత్రికేయులపైనా అదే ధోరణి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే అక్కసు
‘సాక్షి’పై కొనసాగుతున్న సర్కారు కక్ష సాధింపు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని నిలదీస్తున్న ‘సాక్షి’పై చంద్రబాబు సర్కారు కక్ష సాధింపుగా వ్యవహరిస్తోంది. సాక్షి ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డితోపాటు పలువురు పాత్రికేయులపై వరుసగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది. నోటీసుల పేరుతో అర్ధరాత్రి, తెల్లవారుజామున పోలీసులు వచ్చి హంగామా చేస్తున్నారు. సంబంధిత పాత్రికేయులు లేరని చెప్పినా వినకుండా కార్యాలయాల్లోకి ప్రవేశిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కూటమి సర్కారు కాల రాస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులు ఎమర్జెన్సీ నాటి దురాగతాలను తలపిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ప్రతిసారీ ఎక్కడో చోట, సంబంధం లేని వ్యక్తులతో ఫిర్యాదు చేయించి సాక్షి పైకి పోలీసులను ఉసిగొల్పుతున్నారు. సోషల్ మీడియా, భావ ప్రకటన విషయంలో కేసులకు సంబంధించి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ పోలీసు శాఖ టీడీపీ పెద్దలకు జీహుజూర్ అనడానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తోంది.
జర్నలిస్టు సంఘాల ఖండన..
సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు హేయం అని, కూటమి ప్రభుత్వ తీరు ప్రజా స్వామ్యానికే చేటు అంటూ జర్నలిస్టు సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర వ్యాప్తంగా పత్రికపై ప్రభుత్వ వేధింపులు, అక్రమ కేసులు నమోదు చేయడాన్ని పాత్రికేయ సంఘాలు ఖండించాయి. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై సమష్టిగా పోరాడతామని ప్రకటించాయి.
‘సాక్షి’పై కక్ష ఇలా..
●గతేడాది ఆగస్టు 31న విజయవాడలో వరదల సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసినందుకు ‘సాక్షి’పై అక్రమ కేసు నమోదు చేశారు.
●జై భారత్ గో సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే గోశాలను కూల్చేయడాన్ని ప్రశ్నించిన నందిగామ టౌన్ విలేకరిపై టీడీపీ నేతల ప్రోద్బలంతో గతేడాది జూన్‌లో అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. దీంతో పాటు వార్తలు రాసినందుకు ఇదే విలేకరిపైన మరో రెండు అక్రమ కేసులు బీఎన్‌ఎస్111 సెక్షన్‌ల కింద నమోదు చేశారు.
●రాష్ట్రంలో డీఎస్పీలు, ఏఎస్పీలుగా ఉద్యోగోన్నతులు కల్పించే అంశంలో కొంత మంది డీఎస్పీలు తీవ్రంగా నష్టపోయారని రాసిన వార్తపై పోలీసులు కక్ష పూరితంగా వ్యవహరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో అక్రమ కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 1 అర్ధరాత్రి 12.30 నుంచి 2 గంటల వరకు విజయవాడ ఆటోనగర్‌లోని ప్రధాన కార్యాలయంలో చొరబడి సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సెప్టెంబర్ 2న రాత్రి వచ్చి హడావుడి చేశారు. సెప్టెంబర్ 11న ఎడిటర్, పాత్రికేయులను తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో విచారణ పేరుతో మూడు గంటల పాటు వేచి ఉండేలా చేశారు. పాత్రికేయ ప్రమాణాలకు విరుద్ధంగా ప్రశ్నలు సంధించారు.
●నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు ఎడిటర్‌కు నోటీసుల పేరుతో విజయవాడలోని సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద ఆదివారం తెల్లవారుజామున పోలీసులు దారుణంగా వ్యవహరించారు. మళ్లీ సోమవారం ఉదయం 8.30 గంటలకు సాక్షి కార్యాలయం వద్దకు పోలీసులు వచ్చారు.
●బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్‌లోని సాక్షి ఆఫీసు వద్ద నెల్లూరు పోలీసులు హల్‌చల్ చేశారు. సాక్షి ఎడిటర్‌కు నోటీసులు ఇష్యూ చేసేందుకు అని చెప్పి గంటల తరబడి ప్రశ్నించారు. ఈ తీరును నిరసిస్తూ జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.