
ఉద్యమం...ఉధృతం
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ధర్నా చౌక్‌లో గత 12 రోజులుగా నిర్వహిస్తున్న పీహెచ్‌సీ వైద్యుల ఉద్యమం ఉధృతరూపం దాల్చుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలోని వైద్యులు మాత్రమే రిలే దీక్షలు, నిరసనల్లో పాల్గొనగా, ఇప్పుడు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సైతం పాల్గొనడంతో దీక్షా శిబిరం నినాదాలతో హోరెత్తుతోంది. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీల్లో పనిచేసే 2700 మంది వైద్యులు విధులను బహిష్కరించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.
వైద్యులకు మద్దతుగా వైద్య సిబ్బంది
వైద్యులకు మద్దతుగా పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది సైతం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతూ తమ నిరసనను తెలియచేస్తున్నారు. అవసరమైతే తాము కూడా విధులు బహిష్కరించేందుకు సిద్ధమేనని ఇప్పటికే ప్రకటించారు. మరో వైపు సెకండరీ హెల్త్‌లో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది, టీచింగ్ వైద్యుల సంఘాలు సైతం ఇప్పటికే మద్దతు ప్రకటించాయి.