
సతికి బదులు పతి హాజరు
ఆయన భార్య ట్రస్ట్ బోర్డు సభ్యురాలు.. అనివార్య కారణాలతో ఆమె ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే ఏంటీ.. తన భార్యను ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమించడంతో ఆమె స్థానంలో భర్త దర్జాగా ఆలయ అధికారులతో పరిచయ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలోనూ మిగిలిన బోర్డు సభ్యుల మధ్యలో కూర్చొని ఆద్యంతం సమావేశం ముగింపు వరకు అక్కడే ఉన్నారు. ఈ ఘటన గురువారం దుర్గగుడిలో చోటు చేసుకుంది. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా పద్మావతి ఠాకూర్ నియమితులయ్యారు. అయితే గత శనివారం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకారానికి పద్మావతి ఠాకూర్ హాజరు కాలేదు. గురువారం నిర్వహించిన సమావేశానికి కూడా ఆమె హాజరుకాకపోగా, ఆమె స్థానంలో భర్త అజయ్‌వర్మ ఠాకూర్ బోర్డు సభ్యులతో కలిసి సమావేశంలో పాల్గొనడం దుర్గగుడిలో చర్చనీయాంశంగా మారింది.