
టికెట్ తనిఖీల ద్వారా రూ.1.22 కోట్ల ఆదాయం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన టికెట్ తనిఖీల ప్రత్యేక డ్రైవ్ ద్వారా రూ.1.22 కోట్లు ఆదాయం ఆర్జించింది. ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగిన ఈ తనిఖీలలో 716 మంది టికెట్ తనిఖీ సిబ్బంది డివిజన్‌లోని రైళ్లు, స్టేషన్‌లలో చేపట్టిన ప్రత్యేక తనిఖీలలో అనధికారిక ప్రయాణం చేస్తున్న వారిపై 17,017 కేసులు నమోదు చేయడం ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందులో టికెట్ లేని ప్రయాణికులపై 7,928 కేసులు, సరైన టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారిపై 9,034 కేసులు, అనధికారిక లగేజీలపై 55 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో మొదటి రోజు రూ.37.03 లక్షలు, రెండవ రోజు రూ.40.26 లక్షలు, మూడవ రోజు రూ.45.03 లక్షల పెనాల్టీలు వసూలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ డీసీఎం బి.ప్రశాంత కుమార్ మాట్లాడుతూ రైళ్లలో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం సరైన టికెట్‌తోనే ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. సరైన ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సజావుగా వారి ప్రయాణాన్ని కొనసాగించేందుకు డివిజన్‌లో ఇటువంటి డ్రైవ్‌లు తరచుగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.