
టీడీపీలో చీడ పురుగులు!
వాటి దాడి తట్టుకోలేక బయటకొస్తున్నా పార్టీకి తిరువూరు సీనియర్ నేత వెంకటేశ్వరరావు గుడ్‌బై ఇటీవల నియోజకవర్గంలో పెరిగిన పార్లమెంట్ ప్రజాప్రతినిధి పెత్తనం భగ్గుమంటున్న నియోజకవర్గ ప్రజాప్రతినిధి వర్గం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరు టీడీపీలో ముసలం మొదలైంది. ఆది నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన టీడీపీ సీనియర్ నేత ఎన్‌టీ వెంకటేశ్వరరావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కొన్ని చీడ పురుగుల వల్ల పార్టీ నుంచి తప్పుకోవాల్సి వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం పార్లమెంటు ప్రజా ప్రతినిధి, ఆయన కార్యాలయంలో పనిచేసే మరో వ్యక్తేనన్న భావన టీడీపీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో ఆ ఇద్దరి మితిమీరిన జోక్యంతోపాటు అవినీతి అక్రమాలను ప్రోత్సహిస్తుండటంతో పార్టీ పరువు బజారున పడిందనే భావన వ్యక్తం అవుతోంది.
పెత్తనం కోసం పట్టు..
తిరువూరులో ఎస్సీ వర్గం నుంచి నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఉండటంతో పార్లమెంటు ప్రజా ప్రతినిధి అంతా తన కనుసన్నల్లోనే జరగాలని పట్టు పడుతున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధిని అవమానించే రీతిలో అన్ని విషయాల్లో జోక్యం చేసుకొంటూ, తన కార్యాలయం నుంచి సమాంతరంగా రాజకీయాలు నడుపుతూ, ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇసుక, మద్యం, గ్రావెల్, గంజాయి, రేషన్ బియ్యం ఇలా అవినీతి వ్యవహారాలన్నీ కొంత మంది దళారులను పెట్టుకొని నడిపిస్తున్నారు. దీంతో ఆది నుంచి పార్టీ కోసం కష్ట పడిన టీడీపీ వర్గాలు కారాలు, మిరియాలు నూరుతున్నాయి. ఇప్పటికే పార్లమెంటు ప్రజాప్రతినిధి వ్యవహార శైలిపై అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేసినా, ఆయన తీరులో మాత్రం మార్పు రావటం లేదని తెలుస్తోంది.
అవినీతిలో అందె వేసిన చెయ్యి..
అవినీతి దందాల విషయంలో పార్లమెంటు ముఖ్యనేతదే పైచేయిగా మారింది. రేషన్ మాఫియాకు చెందిన వ్యక్తిని తన కార్యాలయంలోనే ఉంచుకొని రేషన్ బియ్యం, నెలవారీ మామూళ్లు దండుకోవటాన్ని నియోజకవర్గ ప్రజా ప్రతినిధి సహించలేక పోతున్నారు. పార్టీ పదవులు, దేవాలయ చైర్మన్‌లు, నామినేటెడ్ పదవులను బేరం పెట్టి కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. పార్లమెంటు కార్యాలయంలో పనిచేసే వ్యక్తితో పాటు, మరో వ్యక్తి ద్వారా పార్టీ పదవులకు, నామినేటెడ్ పదవులకు రూ. లక్షలు వసూలు చేశారు. 34 సహకార సంఘాల చైర్మన్లలో దాదాపు 25 మంది దగ్గర ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షలు వసూలు చేసినట్లు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. మండల టీడీపీ అధ్యక్ష పదవుల కోసం రూ.25లక్షలు వసూలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలోనే టీడీపీ సీనియర్ నాయకులు కలత చెంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చర్చ సాగుతోంది. ఎన్నికల సమయంలో రూ.3కోట్లు ఖర్చు పెట్టి పార్టీ గెలుపు కోసం కష్టపడిన ఓ ఎన్‌ఆర్‌ఐని అధికారంలోకి రాగానే పక్కన పెట్టారు. పార్టీకి సేవ చేసి రూ.2కోట్లు ఖర్చు పెట్టిన మరో వ్యక్తిని సైతం అవమానించడంతో పార్టీకి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. ఇలా అక్కడ పార్ల మెంటు ప్రజా ప్రతినిధి అహంకార పూరిత ధోరణితో పార్టీలో విభేదాలు మరింత రచ్చకెక్కుతున్నాయి.