పీఎం సభకు కమర్షియల్‌ టార్గెట్లు | - | Sakshi
Sakshi News home page

పీఎం సభకు కమర్షియల్‌ టార్గెట్లు

Oct 15 2025 6:24 AM | Updated on Oct 15 2025 6:24 AM

పీఎం సభకు కమర్షియల్‌ టార్గెట్లు

పీఎం సభకు కమర్షియల్‌ టార్గెట్లు

పీఎం సభకు కమర్షియల్‌ టార్గెట్లు

ప్రధాని సభకు వ్యాపారులను తరలించాలని కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు ఆదేశాలు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 2 వేల మంది వ్యాపారులను తరలించాలని హుకుం వారి ప్రచారం తమ చావుకొచ్చిందని మండిపడుతున్న కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులు

కేంద్ర నిర్ణయాన్ని తమదని చెప్పుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ‘వారి ప్రచారం మా చావుకొచ్చింది. గతంలో ఎప్పుడూ లేదు. రాజకీయ ప్రచార సభకు మమ్మల్ని జనాలను పోగేయమంటున్నారు. ఇదెక్కడి తలనొప్పి మాకు?’ అంటూ ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వాపోతున్నారు. సూపర్‌ జీఎస్టీ – సూపర్‌ సేవింగ్స్‌ ప్రచారంలో భాగంగా ఈ నెల 16వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కర్నూలులో సభ నిర్వహిం చనున్నారు. ఈ సభకు వ్యాపారులను తరలించాలని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు టార్గెట్లు విధించారని సమాచారం. ఈ టార్గెట్లు ఆ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర దుమారం లేపుతున్నాయి. ప్రధాని సభకు తాము జనాలను పోగే యటం ఏమిటంటూ తలలు పట్టుకుంటున్నారు.

నాలుగైదు రోజులుగా అధికారులపై ఒత్తిడి

ప్రధానమంత్రి సభకు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి రెండు వేల మంది వ్యాపారులను తరలించాలని వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులకు టార్గెట్లు విధించారని సమాచారం. ఉమ్మడి జిల్లాలోని విజయవాడ–1, విజయవాడ –2, విజయవాడ–3 డివిజన్లకు సంబంధించి 17 సర్కిళ్ల కార్యాలయ అధికారులకు ఈ మేరకు వాట్సాప్‌ గ్రూప్‌లతో పాటుగా ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్‌లను నిర్వహించి మరీ టార్గెట్‌లు పెడుతున్నారని స్థానిక అధికారులు చెబుతున్నారు. ప్రధానమంత్రి సభకు వచ్చే వ్యాపారుల పేర్లు, వారి వివరాలను సేకరించి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని నాలుగైదు రోజులుగా తమపై ఒత్తిడి పెట్టారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో అర్థంకాక ప్రభుత్వంపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మండిపడుతున్నారు.

ప్రచార బాధ్యతలు వారిపైనే

సూపర్‌ జీఎస్టీ – సూపర్‌ సేవింగ్స్‌ పేరుతో సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 19వ తేదీ వరకూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం చేప ట్టింది. ఆ ప్రచార కార్యక్రమాల్లో స్థానిక వ్యాపారవేత్తలు, పారిశ్రామికవర్గాలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాల్సి ఉంది. ఆ వర్గాలకు అవసరమైన జీఎస్టీ తగ్గింపు, శ్లాబ్‌ల మార్పు తదితర సమాచారాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఇవ్వాలి. ఈ కార్యక్రమాల అనంతరం ఆ ఫొటోలను స్థానిక సచివాలయ సిబ్బంది ఆప్‌లోడ్‌ చేయాలి. అయితే ప్రభుత్వం నిర్దేశించినా ఆయా వర్గాలు ఈ కార్యక్రమాలు అనుకున్న స్థాయిలో నిర్వహించడం లేదు. దీంతో ఉన్నతాధికారుల ఒత్తిడితో వాణిజ్య పన్నుల శాఖ అధికారులే కార్యక్రమాలను చేపడుతున్నారు. వారే విద్యాసంస్థలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఎవరో చేయాల్సిన కార్యక్రమాలను సైతం తమతో చేయించటం ఏమిటంటూ రాష్ట్ర స్థాయి అధికారుల తీరుపై వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అందుబాటులో లేని అధికార యంత్రాంగం

వాణిజ్య పన్నుల శాఖలో 15 రోజులుగా అధికారులెవరూ అందుబాటులో ఉండటం లేదని వ్యాపార వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఏ సర్కిల్‌ కార్యాలయానికి వెళ్లినా అధికారులు ఏదో ప్రచారంలో ఉన్నారని, లేదా పాఠశాలలో పోటీలు నిర్వహించటానికి వెళ్లారని ఆ కార్యాలయాల్లో ఉంటున్న ఒకరిద్దరు సిబ్బంది వ్యాపారులకు చెప్పి మళ్లీ రావాలంటూ తిప్పి పంపుతున్నారని పలువురు చెబుతున్నారు. 15 రోజులుగా తమను ఉన్నతాధికారులు ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, పోటీల పేరుతో కార్యాలయాలకు దూరంగా ఉండటంతో చాలా పనులు పెండింగ్‌లో పడిపోయాయంటూ వాణిజ్య పన్నుల శాఖకు చెందిన అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

జీఎస్టీ శ్లాబ్‌ల మార్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అయితే దానిని తమ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకోవటం, ధరలన్నీ తగ్గిపోయాయని ఊదరగొట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంత ప్రచారం నిర్వహించినా ప్రజల నుంచి అనుకున్న స్థాయిలో స్పందన రావటం లేదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఈ మేరకు ఆయా అధికారుల టెలికాన్ఫరెన్స్‌ సమావేశాల్లో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సీనియర్‌ అధికారులు చెబు తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని సభకు వ్యాపారుల తరలింపు బాధ్యతలు అప్పగించడంతో ‘ఇదెక్కడి తలనొప్పి’ అంటూ ఉమ్మడిజిల్లాలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement