
ఎస్సీ, ఎస్టీలపై దాడులను ఎదుర్కొనేందుకు ఐక్య ఉద్యమం
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను ఎదుర్కొనేందుకు ఐక్య ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్), ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అధ్యక్షతన మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై మతోన్మాది బూటుతో దాడి, సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యలను నిరసిస్తూ జరిగిన ఈ సమావేశంలో దళిత శోషన్ ముక్తి మంచ్(డీఎస్‌ఎంఎం) జాతీయ ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు మాట్లా డుతూ.. ప్రజలకు రక్షణగా ఉన్న న్యాయ, పోలీసు వ్యవస్థల్లో దళితులకు రక్షణ కరువైందన్నారు. సీజేఐ గవాయ్‌పై దాడి దేశ ప్రజలపై జరిగిన దాడిగా పేర్కొన్నారు.
గతంలో మహారాష్ట్ర పర్యటనలోనూ అవమానించారని గుర్తుచేశారు. ఐపీఎస్ పూరన్ కుమార్ సమర్థమైన పోలీసు అధికారి అని, కుల వివక్ష వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుత పరిస్థితికి అద్ధం పడుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ.. దళితులు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వివక్ష కొనసాగుతోందన్నారు. ఐపీఎస్ అధికారి పూరన్‌కుమార్ ఆత్మహత్యకు కారకులైన వారిపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. బీజేపీ పాలిత, తెలుగు రాష్ట్రాల్లోను దళిత, గిరిజనులపైన దాడులు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయని జాతీయ నేర గణాంక బ్యూరో నివేదిక వెల్లడిస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, న్యాయవాదులు పిచ్చుక శ్రీనివాస్, అశోక్, జైభీమ్ జైభారత్ పార్టీ నాయకుడు కొండలరావు, ఆమ్‌ఆద్మీ నాయకుడు నేతి మహే శ్వరరావు, ఐఏఫ్‌టీయూ నాయకుడు రామకృష్ణ, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాస్, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.క్రాంతికుమార్ మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన ఎస్సీ, ఎస్టీ సంఘాలన్నీ గవర్నర్‌కు అర్జీ ఇవ్వాలని రౌండ్‌టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది.