
కలెక్టర్‌కు జగనన్న కాలనీల్లో సమస్యలు ఏకరవు
పెడన: కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ మంగళవారం పెడన పట్టణంలోని పలు జగనన్న కాలనీలను ఆకస్మింకంగా పరిశీలించారు. పైడమ్మ లే అవుట్ కాలనీలో వాసుల వద్దకు వెళ్లి మాట్లాడారు. కాలనీలో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వర్షం వస్తే నడిచే పరిస్థితి లేదని, తాగునీరు సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు చేశారు. మునిసిపల్ కమిషనర్ ఎల్.చంద్రశేఖరరెడ్డి, ఏఈ సీతారామాంజనేయులు ఆయా సమస్యలను రాసుకుని, తాగునీటికి అదనంగా ట్యాంకులు పంపించేలా చూస్తామన్నారు. మొత్తం ఎన్ని ఇళ్లు పూర్తి అయ్యాయో వివరాలను హౌసింగ్ ఏఈ మాధవి కలెక్టర్‌కు వివరించారు. అనంతరం సొంత స్థలాల్లో పీఎంజేఆర్ కింద నిర్మించుకున్న ఇళ్లను పరిశీలించారు. నాలుగో వార్డు పాతపేటలో ఎ.కోటనాగేశ్వరరావు ఇంటిని నిర్మించుకున్నా బిల్లులు రాలేదని ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ పల్లోటి కాలనీలో పర్యటించగా, స్థానికులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. పగలు పనులు నిమిత్తం ఇళ్లకు తాళాలు వేసుకుని పెడన పట్టణానికి వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చేసరికి తాళాలు పగలగొట్టి దొంగలు ఇంట్లో నగదు, నగలు ఎత్తుకుపోతున్నారంటూ వాపోయారు. తాగునీరు రావడం లేదని, చెత్త కూడా తీసుకువెళ్లే వారు లేరని పేర్కొన్నారు. రోడ్లు కూడా లేవని, పల్లోటి ఎంట్రన్స్‌లో మట్టి రోడ్డు నుంచి రాలేని దుస్థితి ఏర్పడిందని, వాహ నాలు కూడా రావడం లేదని వాపోయారు. రాత్రి అయితే పాములకు భయపడుతున్నామని పేర్కొ న్నారు. తక్షణం మెయిన్ రోడ్డు నుంచి కాలనీకి వచ్చే మార్గంలో వీధిలైట్లు వేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పర్యటనలో హౌసింగ్ పీడీ పోతురాజు, ఇన్‌చార్జి డీఈ బుచ్చిబాబు, ఏఈ మాధవి, ఇన్‌చార్జి తహసీల్దారు అనిల్‌కుమార్, ఎంపీడీఓ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.