
రూ.12.48 లక్షల ఉపాధి నిధుల రికవరీకి ఆదేశాలు
మొవ్వ: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల 17వ విడత సామాజిక తనిఖీ సోషల్ ఆడిట్ జరిగింది. ఈ సందర్భంగా రూ.12.48 లక్షల రికవరీకి డ్వామా పీడీ ఎన్.వి.శివప్రసాద్ యాదవ్ ఆదేశించారని ఏపీఓ దేవానంద్ రాజు తెలిపారు. రూ.1.25 లక్షల జరిమానా విధించడంతోపాటు రూ.11 లక్షల పనులకు సంబంధించి మరో మారు విచారణ చేయాలని ఆదేశించారని పేర్కొన్నారు. పెదముత్తేవి గ్రామంలో పక్షవాతంతో ఆస్పత్రిలో మూడు నెలలపాటు చికిత్స చేయించుకుంటున్న చిందా వెంకటరాజు, చనిపోయిన కంచర్ల వెంకటేశ్వరరావు, దాసరి మురళి ఇద్దరిజాబు పనులకు వచ్చినట్లు మస్టురు వేయటం, అంగన్వాడీ హెల్పర్ గండ్రపు దేవకుమారి, వెలుగు బుక్ కీపర్ మండా దివ్యభారతిని పనులకు తీసుకెళ్లడం వంటి ఘటనలు మండల స్థాయి సమావేశంలో వెలుగు చూడటంతో పెదముత్తేవి ఫీల్డ్ అసిస్టెంట్ వి.సీతారామదాసును సస్పెండ్ చేస్తూ, నిధులు రికవరీ చేయాల్సిందిగా వెలుగు చూడటంతో డ్వామా పీడీ శివప్రసాద్ యాదవ్ ప్రజా వేదికలో ఆదేశాలు జారీ చేశారు. వేములమడలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా పొలాల్లో నిమ్మ మొక్కలు నాటిన రైతులు కొనకళ్ల శ్రీనివాసరావు, నారగం హరికృష్ణ ప్రసాద్‌కు 14 నెలలుగా మొక్కల కొనుగోలు బిల్లు చేయకపోవడంతో టెక్నికల్ అసిస్టెంట్ నాగలక్ష్మికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. రెండు రోజుల్లో బిల్లు చేయాలని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండేటి ఇందిర, ఎస్‌ఎస్‌ఐఐటీ అడిష నల్ డైరెక్టర్ రామారావు, ఎంపీడీఓలు జె.విమాదేవి, డి.సుహాసిని, అంబుడ్స్‌మన్ కె.వి.శ్రీనివాసరావు, ఇన్‌చార్జి డీవీఓ సురేష్, ఎస్‌ఆర్‌పీ సుబ్బారావు, ఏపీఓ లక్ష్మీరెడ్డి, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.