
చిట్టీలు, గోల్డ్ స్కీం పేరుతో భారీ మోసం
పోలీస్‌స్టేషన్‌కు క్యూకట్టిన బాధితులు
పెనుగంచిప్రోలు: పేద, మధ్య తరగతి ప్రజల ఆశను సొమ్ము చేసుకున్నాడు పెను గంచిప్రోలు గ్రామానికి చెందిన వ్యాపారి చిన్నం చిన్న దుర్గారావు. ఎన్నో సంవత్సరాలుగా గ్రామంలోనే కాకుండా చుట్టు పక్కల గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ వస్త్ర వ్యాపారం చేసేవాడు. ఆ తరువాత తిరుపతమ్మవారి ఆలయ సమీపంలో లక్ష్మీ దుర్గ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఎలక్ట్రికల్ వస్తువులు, ఫర్నిచర్ దుకాణం ప్రారంభించాడు. సమీపంలోనే అతని కుమారుడు వస్త్ర దుకాణం నిర్వహిస్తూ ఎంతో నమ్మకంగా ఉండేవారు. ఈ క్రమంలో దుర్గారావు చిట్టీలతో పాటు గోల్డ్ స్కీం వ్యాపారం చేపట్టాడు. గ్రామాల్లో తనకు ఉన్న పరిచయాలతో బంగారం ఒక్కసారిగా కొనలేని వారు వాయిదా పద్ధతిలో నగదు కట్టి బంగారం పొందొచ్చని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన 175 మంది సభ్యులుగా చేరారు. ఒక్కొక్కరు నెలకు రూ.3 వేల చొప్పున 22 నెలలు పాటు చెల్లించాలి. ప్రతి నెలా లాటరీ తీసి విజేతలకు పది గ్రాముల బంగారం చెల్లించాలి. ఈస్కీం మే నెలతోనే పూర్తయింది. 22 మందికి లాటరీలో బంగారం ఇవ్వగా మిగిలిన వారికి 22 నెలలకు వారు చెల్లించిన రూ.66 వేలకు 10 గ్రాముల చొప్పున బంగారం ఇవ్వాలి. మరికొందరు భవిష్యత్‌కు ఆసరాగా ఉంటుందని అతని వద్ద రూ.లక్ష చిట్టీలు కట్టారు. మరికొందరు వడ్డీకి అప్పులు ఇచ్చారు. గడువు తీరినా డబ్బులు, బంగారం చెల్లించకపోవటంతో కొద్ది రోజులుగా దుర్గారావును బాధితులు నిలదీయటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ నెల పదో తేదీ రాత్రి కుటుంబంతో గ్రామం నుంచి పరారయ్యారు. దుకాణాలు మూసి వేయటంతో పాటు సెల్‌ఫోన్లు కూడా స్విచ్చాఫ్ కావటంతో బాధితులు రెండు రోజులుగా పోలీస్‌స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. సుమారుగా రూ.5 కోట్ల వరకు అతను వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు పేర్కొంటున్నారు. సోమవారం సాయంత్రం వరకు చిన్నం చిన్నదుర్గారావుపై 32 ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. అతని బాధితులు పెనుగంచిప్రోలుతో పాటు నవాబుపేట, ముండ్లపాడు, గౌరవరం, భీమ వరం గ్రామాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. 40 ఏళ్ల నుంచి గ్రామంలో వస్త్ర వ్యాపారం చేస్తూ ఎంతో నమ్మకంగా ఉన్నాడని, ఒక్కో కుటుంబంలో రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇచ్చిన వారు ఉన్నారని, లాఖరికి పింఛన్ సొమ్ము మొత్తం ఇచ్చానని నవాబుపేట గ్రామానికి చెందిన తూమాటి విజయమ్మ వాపోయింది. తనకు రూ.4.50 లక్షలు రావాలని కన్నీటిపర్యంతమైంది. చిట్టీ పాటలు, గోల్డ్ స్కీం నుంచి తమ కుటుంబానికి రూ.8 లక్షలు రావాలని తుమాటి కృష్ణకుమారి తెలిపారు.

చిట్టీలు, గోల్డ్ స్కీం పేరుతో భారీ మోసం