
వారంరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ
ఇరుగ్రామాల ప్రజలతో అధికారులు సమావేశం
నాగాయలంక: మండలం శివారులో సముద్రం తీరాన ఉన్న ఈలచెట్లదిబ్బ వాసుల తాగు, సాగునీటి సమస్యలకు వారంరోజుల్లో తాత్కాలిక పరిష్కారం చూపనున్నట్లు కృష్ణా, బాపట్ల జిల్లాల ఉన్నతాధికారులు ప్రకటించారు. కొద్దికాలంగా ఈలచెట్లదిబ్బ(నాగాయలంక మండలం), లంకెవానిదిబ్బ(బాపట్ల జిల్లా రేపల్లె మండలం) గ్రామాల నడుమ నీటివివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రెండు జిల్లాల అధికారులు ఆయా గ్రామాల పెద్దలు, ప్రతినిధులతో కలసి శుక్రవారం లంకెవానిదిబ్బలో సమావేశమయ్యారు. లంకెవానిదిబ్బ వాసులను ఈలచెట్లదిబ్బ వాసులు తమవైపు నదిలోకి చేపల వేటకు రానీయకుండా అడ్డుకోవడంతోనే వారి గ్రామంలోని లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి దిబ్బకు వచ్చే సాగు,తాగు నీటి పైపులైన్లను అడ్డుకోవడంతో ఇరు జిల్లాల గ్రామాల నడుమ వివాదానికి దారితీసింది. కాగా అధికారులు ప్రధానంగా నీటి సమస్యపైనే దృష్టి కేంద్రీకరించిన నేపధ్యంలో నీటి సమస్య పరిష్కారంపై బందరు ఇంచార్జి ఆర్డీఓ బి.శ్రీదేవి, బాపట్ల ఆర్డీఓ రేపల్లె రామలక్ష్మి నేతృత్వంలో లంకెవానిదిబ్బ లిప్ట్ ఇరిగేషన్ పరిశీలించి అక్కడే ఇరుగ్రామాల వారితో సమావేశమై చర్చించారు. వారం రోజుల్లో తాత్కాలిక పైపులు ఏర్పాటు చేసి ఈలచెట్లదిబ్బ వాసులకు తాగు, సాగునీరు అందించేందుకు లంకెవానిదిబ్బ వాసులను అధికారులు ఒప్పించారు. వచ్చే ఏడాది జూన్‌నాటికి లిఫ్ట్ ఇరిగేషన్‌కు లెవెల్ మెయింటెన్ చేసి లాకులు ఏర్పాటు చేస్తామని అధికార యంత్రాంగం వివరించారు. రాష్ట్ర అగ్నికుల క్షత్రియుల కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, తహసీల్దార్లు సిహెచ్‌వి ఆంజనేయప్రసాద్, టి.శ్రీనివాస్ కృష్ణా ఇరిగేషన్ అధికారులు మోహన్‌రావు(ఎస్‌ఈ), రవికిరణ్(ఈఈ), లిఫ్ట్ ఇరిగేషన్ ఈఈ చెన్నారెడ్డి, డీఈఈ గణపతి, అవనిగడ్డ సీఐ యువకుమార్, నాగాయలంక ఎస్‌ఐ కె.రాజేష్, బాపట్ల జిల్లా ఇరిగేషన్ అధికారులు, రెండు గ్రామాల పెద్దలు, నీటి సంఘాల అధ్యక్షులు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.