
అతిసార పాపం ఎవరి పుణ్యం?
అధికారిక లెక్కల ప్రకారం 122 మంది బాధితులు వంద మంది అంటేనే పెద్ద ఎపిడమిక్ అంటున్న వైద్యులు జీజీహెచ్‌లో 61 మంది చికిత్స పొందుతున్న వైనం వైద్యసేవలు పర్యవేక్షిస్తున్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్
అధికారిక లెక్కలు ఇలా...
లబ్బీపేట(విజయవాడతూర్పు): అతిసారకు కారణం ఏమిటంటే.. ఉత్సవాల్లో వడ్డించిన భోజనాలే అని అధికారులు చెబుతున్నారు. వినాయక నిమజ్జనం రోజు పగలు వండిన వంటకాలు రాత్రి తిన్నారని అందుకే ఇలా...అని అంటున్నారు. కానీ ఆ ప్రాంత ప్రజలు మాత్రం పైప్‌లైన్‌ల నుంచి రంగు మారిన నీరు, దుర్వాసన వస్తున్నాయని చెబుతున్నా అధికారులు పట్టించుకోలేదంటున్నారు.
పెరుగుతున్న బాధితులు
అతిసార బాధితులు గురువారం సాయంత్రం వరకూ ఆస్పత్రులకు పరుగులు పెడుతూనే ఉన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన బాధితులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. దీంతో బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వారిని ప్రత్యేక వార్డుల్లో అడ్మిట్ చేసి జనరల్ మెడిసిన్ నిపుణుల పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. వాంతులు, విరోచనాలు అవడానికి కలుషిత ఆహారం కారణమని అధికారులు చెబుతున్నారు. వంద మందికి పైగా ఎఫెక్ట్ కావడంతో నీరు కూడా కారణమై ఉండవచ్చునని భావిస్తూ ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు.
వైద్య సేవల పర్యవేక్షణ
ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అతిసార బాధితులను గురువారం రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండ్యన్ పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ కూడా ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అతిపెద్ద ఎపిడమిక్ సమస్య కావడంతో న్యూ రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాల్లో గ్రామీణ వైద్యుల క్లినిక్స్(ఆర్‌ఎంపీ)లను మూసివేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని ఆదేశాలు జారీ చేశారు.
న్యూ రాజరాజేశ్వరిపేటలో 122 మంది డయేరియా బారిన పడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వారిలో 61 మంది ఇప్పటికే కోలుకుని డిశ్చార్జి అయ్యారని, ఇంకా 61 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాస్పత్రిలో 61 మంది చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. వారిలో పెద్దవాళ్లు కొత్తాస్పత్రిలో, చిన్నారులు పాత ఆస్పత్రిలోని పిడియాట్రిక్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆయన చెప్పారు.