
ఐటీఆర్‌లో నకిలీ బ్యాంకు స్టేట్‌మెంట్లు
22మంది వైద్య, ఆరోగ్యశాఖ అధికారులపై క్రమశిక్షణ చర్యలు
మచిలీపట్నంఅర్బన్: ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం నకిలీ బ్యాంకు హౌసింగ్ లోన్ స్టేట్‌మెంట్లు సమర్పించిన ఆరోపణలపై ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలోని ఉద్యోగులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. గతంలో జిల్లా మలేరియా అధికారి కార్యాలయంలో పనిచేసిన మల్టీ పర్పస్ హెల్త్ ఎక్స్‌టెన్షన్ అధికారి (ఎంపీహెచ్‌ఈఓ) వీవీ సర్వారాయుడు సహా మొత్తం 42 మంది ఉద్యోగులపై విచారణ జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖకు 2016లో వచ్చిన పోస్టుకార్డు పిటిషన్ ఆధారంగా అధికారులు దర్యాప్తు జరిపారు. ఈ విచారణలో ఉద్యోగులు ఆదాయపు పన్ను సమర్పణలో మినహాయింపులు పొందేందుకు నకిలీ హౌసింగ్ లోన్ స్టేట్మెంట్లు సమర్పించారని తేలింది. దీనిపై 42 మంది ఉద్యోగులపై శాఖ చర్యలు చేపట్టాలని నివేదికలో సిఫార్సు చేశారు. ఈ సిఫార్సుల మేరకు అప్పటి ఎంపీహెచ్‌ఈఓ వీవీ సర్వారాయుడుతో సహా 21 మందికి ఆరోపణల పత్రాలు జారీ అయ్యాయి. వారు ప్రారంభంలో ఆరోపణలను ఖండిస్తూ రాతపూర్వక సమాధానాలు సమర్పించారు.
తప్పును ఒప్పుకుంటూ..
అనంతరం సర్వారాయుడు సహా 33 మంది ఒక సార్వత్రిక ప్రతినిధి పత్రం సమర్పించారు. అందులో ఆదాయపు పన్ను రిటర్న్ సమర్పణలో అనుభవం లేకపోవడంతో ఆడిటర్ సూచనల ప్రకారం నకిలీ పత్రాలు జత చేశామని, విజిలెన్స్ శాఖ వాస్తవాలు వెల్లడించిన వెంటనే రివైజ్డ్ ఐటీ రిటర్న్ దాఖలు చేశామని పేర్కొన్నారు. తమ తప్పును మానవతా ధృక్పథంలో మన్నించాలని అభ్యర్థించారు. ప్రభుత్వం ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, తప్పుడు చర్యలకు పాల్పడినందుకు ప్రస్తుత సేవలో ఉన్న సర్వారాయుడుతో సహా మరో 21 మందిపై రెండు వార్షిక వేతన పెరుగుదలలు నిలిపివేత (క్యూమ్యులేటివ్ ఎఫెక్ట్ లేకుండా) శిక్షను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.