
సరిపడా యూరియా ఇవ్వడం లేదు
చల్లపల్లి: యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ యూరియా సరఫరా చేసేందుకు సరిపడా నిల్వలు ఉన్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ రైతులతో అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీపురం పీఏసీఎస్‌లో బుధవారం రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. కలెక్టర్ బాలాజీ వచ్చి పంపిణీని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వరి సాగుపై ఆరా తీశారు. ప్రస్తుతం ఇస్తున్న యూరియా సరిపోవటం లేదని పూర్తిస్థాయిలో అందించాలని రైతులు కోరారు. ఘంటసాల మండలం మల్లంపల్లి, లంకపల్లి గ్రామాల్లో ఇంకా యూరియా అవసరం ఉందని లంకపల్లికి 50 టన్నులు, మల్లంపల్లికి 30 టన్నుల యూరియా అవసరం ఉందని దాలిపర్రుకు చెందిన రైతు వీరమాచినేని భవానీప్రసాద్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఆందోళన వద్దు..
కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరింత యూరియాను తెప్పిస్తున్నామని యూరియా ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. ఎక్కువగా యూరియా వాడటం వల్ల పంట నాణ్యత దెబ్బతింటుందన్నారు. కాబట్టి రైతులు ఎక్కువగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కలెక్టర్ వెంట మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్, ఏడీఏ ఎస్.శ్యామల, వ్యసాయ, రెవెన్యూ మండల అధికారులు తదితరులు ఉన్నారు.
కృష్ణా కలెక్టర్ బాలాజీకి వివరించిన రైతులు