
ఫ్లెక్సీ వ్యాపారులు నిబంధనలు పాటించాలి
కోనేరుసెంటర్: శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగించేలా ఫ్లెక్సీ వ్యాపారులు ప్రింట్లు వేసినట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు హెచ్చరించారు. బుధవారం ఆయన మచిలీపట్నంలోని ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో అనేక చోట్ల వివాదాస్పద వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిన సందర్భాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఫ్లెక్సీల కారణంగా అనేక ప్రాంతాల్లో వివాదాలు, ఘర్షణలు జరిగిన సంఘటలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీ వ్యాపారులు మతాలను, కులాలను, ప్రాంతాలను, వర్గాలను, వ్యక్తులను కించపరిచే విధంగా ఎవరైనా ఫ్లెక్సీలు ప్రింట్ వేయమని అడిగితే వెంటనే నిరాకరించాలని తెలిపారు. ఒకవేళ అలాంటి ఫ్లెక్సీలు ప్రింటింగ్ వేయాలని ఎవరైనా వచ్చి అడిగినట్లయితే తక్షణమే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే ప్రింటింగ్ ఆఫీసుల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ప్రింటింగ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు