
జౌళి శాఖ నుంచి చేనేతను వేరు చేసి రక్షించాలి
మంగళగిరి టౌన్: జౌళి శాఖ నుంచి చేనేతను వేరు చేసి ప్రత్యేకంగా రక్షించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు కోరారు. మంగళగిరి నగర పరిధిలోని సంఘ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత పరిశ్రమ రక్షణకు ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన పెడనలో చేనేత అధ్యయన యాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రిబేట్, యార్న్ సబ్సిడీ, ట్రిప్ట్ ఫండ్, పావలా వడ్డీ, మార్కెటింగ్ ఇన్సెటివ్‌లు కలిపి రూ.127.87 కోట్ల బకాయిలుగా ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని తక్షణమే విడుదల చేసిన సహకార సంఘాలు, చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాల పాలకవర్గ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కోరారు. మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి నేతన్న భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.36 వేలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. చేనేతపై విధించిన జీఎస్‌టీని రద్దు చేయాలని పేర్కొన్నారనీ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి మోహనరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట కృష్ణ, నియోజకవర్గ అధ్యక్షులు గిరి తదితరులు పాల్గొన్నారు.