పెనమలూరు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటున్నారా లేదా అని ప్రశ్నించారు. వైద్యులు అందిస్తున్న వైద్య సేవల వివరాలు కలెక్టర్ పరిశీలించారు. ఆస్పత్రిలో ఎన్ని రకాల మందులు ఉన్నాయి అని అడిగి, రిజిస్టర్‌లు తనిఖీ చేశారు. జ్వరాలు ఉన్నందున ఫీల్డ్ లెవల్‌లో స్టాఫ్ సర్వే చేస్తున్నారా అని అడిగారు. ఆస్పత్రిలో డెలివరీ కేసుల వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు కూడా చేయాలని సూచించారు. ఆర్‌డీవో హేలాషారోన్, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీవో డాక్టర్ బండి ప్రణవి, మండల వైద్యాధికారి సాయిలలిత, సిబ్బంది పాల్గొన్నారు.
ఇమామ్, మౌజన్లకు ‘గౌరవం’ ఇవ్వండి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వం ఇమామ్, మౌజన్లకు గౌరవవేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ కాశీం డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చౌక్, కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇమామ్‌లకు నెలకు రూ.10వేలు, మౌజన్లకు రూ.5వేలు గౌరవ వేతనాలను చెల్లించడం లేదన్నారు.
గత ప్రభుత్వంలో ఏ ఒక్క నెల కూడా బకాయిలు లేకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లించారని గుర్తు చేశారు. జిల్లాలో 153 మంది మౌజన్లు, 153 మంది ఇమామ్‌లకు గౌరవ వేతనం బకాయి ఉందన్నారు. అనంతరం కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. జిల్లా మునిసిపల్ వింగ్ అధ్యక్షుడు మీర్‌అస్గర్‌అలీ, మైనార్టీ సెల్ నాయకులు అషరఫ్, మొహమ్మద్ ఖాజా, అన్వర్, మొహమ్మద్ ఖలీద్ పాల్గొన్నారు.
అక్షరాస్యత సాధనకు ఉల్లాస్
మచిలీపట్నం అర్బన్: సంపూర్ణ అక్షరాస్యత సాధనలో ఉల్లాస్ కార్యక్రమం కీలక భూమిక వహిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో 59వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, వయోజన విద్యా ఉపసంచాలకులు ఎండి. హాజీబేగ్ అక్షరాస్యతా గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం ద్వారా 73,237 మంది నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకొని అక్షరాస్యత సాధనకు చర్యలు చేపట్టామన్నారు. విశేషంగా కృషి చేసిన 14 మంది వలంటీర్ టీచర్లకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్నామన్నారు. కలెక్టరేట్ నుంచి ర్యాలీ నిర్వహించగా, వయోజన విద్యా సిబ్బంది, ఉల్లాస్ వలంటీర్లు, సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
కూచిపూడిలో అభివృద్ధి పనులపై సర్వే
కూచిపూడి(మొవ్వ): నాట్య క్షేత్రమైన కూచిపూడిని వారసత్వ సంపద గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అధికారులు సర్వే నిర్వహించినట్లు డెప్యూటీ ఎంపీడీవో ఎంఎస్‌కే పరమాత్మ తెలిపారు. నాట్యపుష్కరిణి, మ్యూజియం, నాట్య లెజెండ్ పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం స్మృతి సదనం, శ్రీ గంగా బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ రహదారికి ఇరువైపులా పాత్‌వే, పంచాయతీ వద్ద ఆర్చీ, సుందరీకరణ తదితర పనులను మూడు కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆయా పనులకు సంబంధించిన మెజర్మెంట్స్(కొలతలు) తీసుకున్నట్లు చెప్పారు. పర్యాటక శాఖ కన్సల్టెంట్ సాహితి, టూరిజం శాఖ ఇంజినీరింగ్ విభాగం డీఈ టి. కుమార్, మేనేజర్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

పీహెచ్‌సీలో కలెక్టర్ తనిఖీలు