
యూరియాపై ఇంత నిర్లక్ష్యమా?
పత్రికల్లో వచ్చే వార్తలకు స్పందించరా? యూరియా వివరాలు ఎందుకు తెలియపర్చలేదు? మీ కోసంలో వ్యవసాయశాఖ అధికారిపై కలెక్టర్ ఆగ్రహం ప్రజల నుంచి మొత్తం 152 అర్జీలు స్వీకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): పత్రికల్లో యూరియాపై నిత్యం వార్తలు వస్తున్నాయని.. వాటిపై స్పందించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదా అని కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయాధికారి ఎన్. పద్మావతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు డీఆర్వో కె. చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర శ్రీదేవి, మెప్మా పీడీ సాయిబాబు, హౌసింగ్ ఇన్‌చార్జ్ పీడీ పోతురాజు, డీఎస్పీ చప్పిడి రాజా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
బాధ్యత ఉండాలి కదా?
తొలుత కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో యూరియా సరఫరాపై రైతులు పడుతున్న ఇబ్బందులపై నిత్యం వార్తలు వస్తున్నప్పటికీ వాటిపై స్పందించి జిల్లాలో యూరియా అవసరం ఎంత ఉంటుంది? ఇప్పటి వరకు మనకు ఎంత వచ్చింది? ఇంకా ఎంత రావాల్సి ఉందనే వివరాలు సమాచారశాఖ ద్వారా పత్రికా ప్రతినిధులకు సమాచారం ఇవ్వాల్సి ఉందా? లేదా అని ఆయన వ్యవసాయాధికారిని ప్రశ్నించారు.
కలెక్టర్ విస్మయం..
ప్రజల నుంచి అందుకున్న మీ కోసం అర్జీలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి సజావుగా పరిష్కరించాలని ఆదేశించారు. కొంత మంది అధికారులు ఇంకా 70 అర్జీలను ఇప్పటి వరకు చూడకపోవటం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. మీ కోసంలో మొత్తం 152 అర్జీలను అధికారులు స్వీకరించారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
సముద్రం, కొత్తకాలువ, పాత ఉప్పుటేరు వల్ల కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెందీవి విపరీతంగా కోతకు గురవుతోందని దీవి పరిరక్షణ సమితి అధ్యక్షుడు మాసాబత్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సానా వీరవెంకటసత్యనారాయణ తెలిపారు. కొన్ని ఎకరాల భూమి సముద్రం, ఉప్పుటేరులో కలిసిపోతోందని వివరించారు. ఈ దీవికి సంబంధించి సముద్ర ముఖ ద్వారం వద్ద నిరంతరం డ్రెడ్జింగ్ చేయాలని, అలాగే కొత్త ఇన్‌టేక్ చానల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు.
పౌరసరఫరాల శాఖ పరిధిలో ఉన్న ఎండీయూ వాహనాలను ట్రాన్స్‌పోర్టు వెహికల్స్‌గా మార్పు చేయాలని వైఎస్సార్ కృష్ణాజిల్లా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి. శ్యామ్‌బాబు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎండీయూ ఆపరేటర్లను కూటమి ప్రభుత్వం వచ్చాక నిలుపుదల చేసిందని.. అయితే ఈ వాహనాలను ప్రస్తుతం దేనికీ ఉపయోగించలేక ఆర్థిక భారం పడుతున్నామని వివరించారు. ఆ వాహనాన్ని మొబైల్ క్యాంటీన్‌గా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు.