
కాలుష్య రహిత జిల్లా కోసం కృషి చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగంతో భవిష్యత్తులో మానవ మనుగడే ప్రశ్నార్థకం కానుందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ప్లాస్టిక్‌తో చేసిన ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, ట్రేలు, ఆహ్వాన కార్డులు, పీవీసీ బ్యానర్లుపై ఉన్న నిషేధాన్ని సమర్థంగా అమలు చేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను ఆదేశించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల విక్రేతలు, వినియోగదారులపై జరిమానాలు విధించాలన్నా రు. ప్లాస్టిక్ వస్తువులకు బదులు నార, గుడ్డ, పేపర్‌తో తయారు చేసిన వస్తువులను వినియోగించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఇబ్బందికరంగా మారాయని పేర్కొన్నారు. ఒక్క విజయవాడలోనే సంవత్సరానికి 700 టన్నులకు పైగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ప్రజలు పడేస్తున్నారని వివరించారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ