
దుర్గగుడిలో ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చంద్రగ్రహణం అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని ఆలయ అర్చకులు శుద్ధి చేశారు. సోమవారం తెల్లవారుజాము మూడు గంటలకు పవిత్ర కృష్ణానది నుంచి జలాలను తీసుకొచ్చి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి ఆలయం, ఉప ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు ఈఓ శీనానాయక్, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం సర్వ దర్శనం, రూ.100, రూ.300, రూ.500 టికెట్ల క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. గ్రహణం నేపథ్యంలో తెల్లవారుజామున జరగాల్సిన సుప్రభాత, వస్త్రాలంకరణ, ఖడ్గమాలార్చన, గణపతి హోమం వంటి ఆర్జిత సేవలను రద్దు చేశారు.