
గండిగుంట సొసైటీలో విజిలెన్స్ సీఐ తనిఖీ
ఉయ్యూరు రూరల్: మండలంలోని గండిగుంట గ్రామ కోపరేటివ్ సొసైటీలో విజిలెన్స్ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా కార్యాలయంలోని అధికారులతో ఎరువుల పంపిణీ జరుగుతున్న విషయంపై ఆరా తీశారు. అనంతరం పక్కన ఉన్న గోదాంలో ఎరువుల స్టాకును పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారులు నిస్సీ గ్రేస్‌తో ఎరువుల పంపిణీపై తీసుకుంటున్న జాగ్రత్తల వివరాలు అడిగారు. ఎరువులు రైతులకు అప్పులు ఇస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. విజిలెన్స్ సీఐ వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఎరువుల పంపిణీలో ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. కాగా స్థానిక కోఆపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు అందిస్తున్న ఎరువులపై మండల తహసీల్దార్ సురేష్ కుమార్, ఇన్చార్జి ఎంపీడీవో ఎల్. శివశంకర్, ఎంఏవో నిస్సీ గ్రేస్, ఉయ్యూరు పట్టణ సీఐ టీవీ రామారావు, సొసైటీ అధ్యక్షుడు దండమూడి నాగేశ్వరావు అన్నదాతలకు అందిస్తున్న ఎరువులపై ఆరా తీశారు. ఉయ్యూరు రెవెన్యూ, గండిగుంట గ్రామ పరిధిలో 1800 ఎకరాల ఆయకట్టు ఉందని, ఆ పరిధిలో ఉన్న రైతులందరికీ యూరియా ఇతర ఎరువులను నిష్పక్షపాతంగా పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని తహసీల్దార్ సురేష్ కుమార్ హెచ్చరించారు.