
యూరియా నిరంతర సరఫరాకు చర్యలు చేపట్టండి
టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో యూరియా నిరంతర సరఫరా జరిగేలా చూడాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి యూరియా సరఫరాపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మనగ్రోమోర్ కేంద్రం నుంచి వీలైనంత వరకు యూరియాను గ్రామాలకు తీసుకువెళ్లి అక్కడి రైతులకు పంపిణీ చేయాలన్నారు. యూరియా ఒకే చోటే ఎక్కువగా పంపిణీ చేయవద్దని, సహకార సంఘాల పరిధిలో ఉన్న గ్రామాలన్నింటికి ఎరువులు సక్రమంగా సరఫరా చేయాలన్నారు. ఐఎఫ్‌ఎంఎస్‌లో యూరియా పొందిన రైతులకు వెంటనే బయోమెట్రిక్ వేయించాలని, ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు రైతులను ఎక్కువసేపు క్యూలో ఉండకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. శనివారం 1300 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుందని సాధారణ రైతులతో పాటు కౌలు రైతులకు దీనిని పంపిణీ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో యూరియా సరఫరాలో రైతులకు కలిగే ఇబ్బందులను తెలియజేస్తే వారి వద్ద ఉన్న సమాచారం తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
రూ.1.70 లక్షల ఎరువులు సీజ్
మొవ్వ: మండల కేంద్రం మొవ్వ గ్రామంలో శనివారం రాత్రి వరకు విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీలో భౌతిక విలువలకు రిజిస్టర్ విలువలకు తేడాలు కలిగిన 1,70,240 రూపాయల విలువ గలిగిన ఎరువుల బస్తాలను సీజ్ చేసినట్లు ఏవో బి.సురేష్ బాబు నాయక్ విలేకరులకు తెలిపారు. మొవ్వలోని శ్రీ కనకదుర్గ ఫెర్టిలైజర్స్ దుకాణాన్ని విజిలెన్స్ సీఐ ఎండి ఉమర్, సిబ్బందితో ఈ తనిఖీలలో పాల్గొన్నారని వెల్లడించారు.

యూరియా నిరంతర సరఫరాకు చర్యలు చేపట్టండి