
నేటి విద్యావిధానం ‘కార్పొరేట్’ చేతిలో బందీ
విజయవాడ కల్చరల్: నేటి విద్యావిధానం కార్పొరేట్ విద్యాసంస్థల చేతిలో బందీ అని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతి కమిటీ, కృష్ణా జిల్లా రచయితల సంఘం, రామ్మోహన గ్రంథాలయం ఆధ్వర్యంలో శుక్రవారం ఎంజీ రోడ్డులోని రామ్మోహన గ్రంథాలయంలో అటల్ బిహారీ వాజ్‌పాయ్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయుడు–నాడు–నేడు అంశంగా జాతీయ సదస్సు, గురుపూజోత్సవం, విహంగ వీక్షణం వ్యాస సంపుటి ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మండలి వెంకట కృష్ణారావు.. అందరూ చదువు ‘కొన’కుండా చదువుకోవాలని భావించారన్నారు. ఆచార్య ఎంసీ దాస్ ఉపాధ్యాయుడు నాడు నేడు అంశంగా, నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు ఆచార్య వియన్నారావ్ నేటి విద్యావిధానం– చదువులు అంశంగా ప్రసంగించారు. డాక్టర్ సుశీలమ్మ రచించిన విమర్శ విహంగం వ్యాససంపుటిని అతిథులు ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచందు, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, వివిధ రంగాలకు చెందిన చింతలపూడి కోటేశ్వరరావు, వేములపల్లి కేశవరావు పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి వచ్చిన భాషా సాంస్కృతిక వైభవానికి కృషి చేసిన 120 అధ్యాపకులకు మండలి వెంకటకృష్ణారావు శతజయంతి సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్