జూపూడి పేలుళ్ల వెనుక అనుమానాలెన్నో..? | - | Sakshi
Sakshi News home page

జూపూడి పేలుళ్ల వెనుక అనుమానాలెన్నో..?

Sep 5 2025 5:06 AM | Updated on Sep 5 2025 5:06 AM

జూపూడ

జూపూడి పేలుళ్ల వెనుక అనుమానాలెన్నో..?

భయాందోళనలో భీమేశ్వర కాలనీ ప్రజలు ప్రాణాపాయ స్థితిలో గాయపడిన వెల్డింగ్‌ వర్కర్లు కుటీర పరిశ్రమగా బాణసంచా తయారీ?

ఇబ్రహీంపట్నం: మండలంలోని జూపూడి భీమేశ్వర కాలనీలోని ఓ ఇంట్లో జరిగిన పేలుళ్ల వెనుక ఎన్నో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం రాత్రి పేలుడు జరిగి, ఇద్దరు వెల్లింగ్‌ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన ఇంటితోపాటు మరో ఐదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెల్డింగ్‌ మిషన్‌కు విద్యుత్‌ వినియోగించడం వల్లే పేలుడు జరిగిందని ఇంటి యజమానులు చెబుతుండగా, ఫోరెన్సిక్‌ నివేదికలు వచ్చిన తర్వాత కారణాలు వెల్లడవుతాయని పోలీసులు అంటున్నారు. బాణసంచా తయారీ వల్లే భారీ పేలుడు జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదల ఇంటిలో జరిగిన భారీ పేలుళ్ల వెనుక బలమైన వ్యక్తులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజులుగా పక్క జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు స్థానికులకు పేలుడు ముడిసరుకు ఇచ్చి బాణసంచా తయారీ చేయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బాణసంచా తయారీకి వస్తువుల లెక్కన నగదు ఇస్తున్నారని పేర్కొంటున్నారు.

3 కి.మీ. వినిపించిన పేలుడు శబ్దం

జూపూడి భీమేశ్వరకాలనీలో జరిగిన పేలుడు శబ్దం సుమారు మూడు కిలోమీటర్ల దూరం వినిపించింది. పేలుడు సమయంలో దట్టమైన పొగ అలుముకుని భరించలేని దుర్వాసన వెలువడింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పేలుడు జరిగిందని భావించిన కొందరు విద్యుత్‌శాఖ లైన్‌మెమన్‌కు ఫోన్‌ చేసి విద్యుత్‌ సరఫరా నిలిపివేయించారు. ఓ వైపు భారీ శబ్దం, మరోవైపు దట్టమైన పొగ, ఇంకో వైపు భరించరాని దుర్వాసన, కరెంటు కూడా లేకపోవడంతో ప్రజలు చీకట్లో ప్రాణం అరచేతిలో పెట్టుకుని కాలం గడిపారు. కొందరు చీకట్లో బయటకు పరుగులు తీశారు.

దళారుల ప్రమేయంతో బాణసంచా తయారీ

పొరుగు జిల్లాకు చెందిన కొందరు పేదల కాలనీలను ఆసరాగా చేసుకుని బాణసంచా తీయారీ వృత్తిలోకి లాగుతున్నారు. వారి ఆర్థిక అవసరాలు తెలుసుకుని ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించవచ్చని నమ్మబలికి ప్రమాదకరమైన ఈ వృత్తిలోకి తీసుకొస్తున్నారు. ఉల్లిపాయ బాంబులు వంద తయారీ చేస్తే ఒక రేటు, వెయ్యికి మరో రేటు చొప్పున ఒప్పుకొని కుటీర పరిశ్రమలా బాణసంచా తయారీ చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కోతుల కోసం తీసుకొచ్చిన ఉల్లిపాయ బాంబులను మెట్ల కింద ఉంచామని పేలుడు జరిగిన ఇంటి యజమానులు చెబుతున్నారు. మెట్ల కింద ఉంచిన ఉల్లిపాయ బాంబుల వల్లే భారీ విస్పోటనం జరిగినట్లు తేటతెల్లమవుతోంది. ప్రమాదానికి కారణం కోతుల కోసం తెచ్చిన ఉల్లిపాయ బాంబులా, తయారీ చేసినవా అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

పేలుడు ధాటికి దెబ్బతిన్న భవనం

పేలుడు తీవ్రతకు కుప్పకూలిన రేకుల ఇల్లు

పొట్టకూటికోసం వచ్చి ప్రాణాపాయ స్థితికి..

గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో పేలుడు జరిగిన ఇంటి యజమానులు ఇంటి చుట్టూ ఐరన్‌ మెస్‌ ఏర్పాటు చేసేందుకు కోనాయపాలేనికి చెందిన వెల్డర్లు గోపీ, మహేష్‌ను పిలిపించారు. పొట్టకూటి కోసం వచ్చిన వారిద్దరు పేలుడులో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరారు. ఐరన్‌ మెస్‌ బిగిస్తున్న మహేష్‌ పేలుడు ధాటికి పక్కింటి రేకుల షెడ్డుపైకి ఎగిరిపడ్డాడు. రేకులు పగిలి నేలపై కుప్ప కూలి తీవ్ర గాయాలపాలయ్యాడు. మరో వెల్డర్‌ గోపీపై ప్రహరీ కూలింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గోపీని స్థానికులు బయటకు తీశారు. ఇద్దరినీ 108లో విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గోపీ ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం. ఇంటి యజమానులు బయట ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

రేకుల షెడ్డు ధ్వంసమైంది

నా భర్త చనిపోవడంతో ఒంటిరిగా బతుకీడుస్తున్నా. మా పక్క ఇంటిలో జరిగిన పేలుడు ధాటికి మా రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వెనక గోడలు కూలిపోయాయి. రేకులు పగిలిపోయాయి. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నా. మళ్లీ ఇల్లు నిర్మించుకునే స్తోమతు లేదు. ఇంటి నిర్మాణానికి అధికారులు సహకారం అందించాలి. – మిద్దే శిరోమణి, కాలనీ వాసి

అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం

వెల్డింగ్‌ పనులు చేస్తున్న క్రమంలో బ్లాస్టింగ్‌ జరిగినట్లు ఇంటి యజమానులు చెబుతున్నారు. మేము చేపట్టిన పరిశీలనలో ఎటువంటి ఆధారాలు లభించలేదు. క్లూస్‌ టీమ్‌ నివేదికలను బట్టి బ్లాస్టింగ్‌కు కారణాలు వెల్లడవుతాయి. పోలీస్‌ శాఖ కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. నివేదికల ఆధారంగా త్వరలో పేలుళ్లకు కారణాలు వెల్లడిస్తాం. – దుర్గారావు, వెస్ట్‌జోన్‌ ఏసీపీ

జూపూడి పేలుళ్ల వెనుక అనుమానాలెన్నో..? 1
1/3

జూపూడి పేలుళ్ల వెనుక అనుమానాలెన్నో..?

జూపూడి పేలుళ్ల వెనుక అనుమానాలెన్నో..? 2
2/3

జూపూడి పేలుళ్ల వెనుక అనుమానాలెన్నో..?

జూపూడి పేలుళ్ల వెనుక అనుమానాలెన్నో..? 3
3/3

జూపూడి పేలుళ్ల వెనుక అనుమానాలెన్నో..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement