
సర్వీసు వైద్యులపై చిన్నచూపు తగదు
వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి జీడీఏ ఏపీ సభ్యుల వినతి
లబ్బీపేట(విజయవాడతూర్పు): సర్వీసు వైద్యులపై ప్రభుత్వం కనబరుస్తున్న చిన్నచూపు తగదని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆంధ్రప్రదేశ్(జీడీఏ ఏపీ) ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు ఈ సంఘ ప్రతినిధులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పనిచేస్తున్న వైద్యులు 25 ఏళ్ల సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండానే ఉద్యోగ విరమణ చేస్తున్న విషయాన్ని మంత్రికి వివరించారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో మూడు, నాలుగేళ్లకే సర్వీసులో ఉద్యోగో న్నతి పొందుతున్నారని వివరించారు. వైద్యుల ఉద్యోగోన్నతుల సమస్య పరిష్కారానికి తమిళనాడు, కేరళ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న డైనమిక్ అస్యూర్డ్ కేరీర్ ప్రోగ్రామ్‌ను మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని కోరారు. జనరల్ కేటగిరీ వైద్యులందరినీ ఏకీకృత సీనియారిటీ పరిధిలోని తీసుకు రావాలని, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని ఉన్నత స్థాయి పదవుల్లో వైద్యాధికారులను మాత్రమే భర్తీ చేయాలని, అప్పుడే వైద్యుల్లో కొందరికై నా ఉద్యోగోన్నతులు వస్తాయని వివరించారు. రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్టుల్లో సివిల్ సర్జన్ జనరల్ కేటగిరీ వైద్యులు, జిల్లా స్థాయి ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్టుల్లో డెప్యూటీ సివిల్‌సర్జన్ వైద్యులను మాత్రమే నియమించాలని కోరారు. వైద్య విద్యశాఖ వైద్యులకు 2016 నుంచి బకాయి పడిన యూజీసీ అరియర్స్‌ను చెల్లించాలని కోరారు. వైద్య శాఖ మంత్రిని కలిసిన వారిలో జీడీఏ ఏపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇంజేటి బాబ్జీ శ్యామ్‌కుమార్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పంజాల శ్రీనివాసరావు, డాక్టర్ స్వరూప్‌కాంత్, డాక్టర్ భానుకుమార్, డాక్టర్ యావ్, డాక్టర్ సురేష్‌బాబు, డాక్టర్ గోపాల్‌నాయక్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను అసోసియేషన్ ప్రతినిధులు శాలువాతో సత్కరించారు.