
నూతన సబ్ స్టేషన్లకు స్థలాలు పరిశీలించాలి
ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో నూతన సబ్ స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను పరిశీలించాలని సీఎండీ పి.పుల్లారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా సర్కిల్ కార్యాలయంలో సీఎండీ పుల్లారెడ్డి అధ్వర్యంలో సీపీడీసీఎల్ సర్కిల్ అధికారులతో సమీక్షా సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్, కృష్ణా, సీఆర్‌డీఏ, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల సర్కిల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థలాలు పరిశీలించి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. 33/11 కేవీ సబ్ స్టేషన్లు, సరఫరా లైన్లలో అంతరాయాలు తగ్గించాలన్నారు. ఇందు కోసం ముందుగానే నిర్వహణ పనులు, అవసరమైన సామగ్రి అందించేందుకు, అత్యవసర సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి విద్యుత్ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వ్యవసాయదార్లకు పగటిపూట తొమ్మిది గంటల నిరంతరంగా విద్యుత్ సరఫరా అందించాలని, నూతన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తక్షణమే మంజూరు చేయాలని ఆదేశించారు. పీఎం సూర్యఘర్ పథకం ప్రయోజనాలను వినియోగదారులకు వివరించాలని, జాతీయ గ్రీన్ ఎనర్జీను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణయాదవ్, డైరెక్టర్ ఫైనాన్స్ ఎస్.వెంకటేశ్వర్లు, ఆరు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.