
మహిళా దొంగల ముఠా అరెస్టు
అమ్మమ్మ, నాయనమ్మతో కలసి చోరీలకు పాల్పడుతున్న మనవరాలు 71.04 గ్రాముల బంగారు, 327 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం
గుడివాడరూరల్: అమ్మమ్మ, నాయనమ్మతో కలసి చోరీలకు పాల్పడుతున్న మనవరాలిని గుడివాడ తాలూకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ వి.ధీరజ్ వినీల్ గురువారం విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. మండలంలోని లక్ష్మీనగర్ కాలనీలో శేషుకుమారి నివసిస్తోంది. ఆమె ఇంటిలో ఖాళీగా ఉన్న పోర్షన్‌లో అమ్మమ్మ రాజేశ్వరి, నాయనమ్మ రమావతితో కలసి విజయవాడకు చెందిన రాగమాధురి అద్దెకు దిగింది. వారు శేషుకుమారితో స్నేహంగా ఉంటూ ఆమె నమ్మకం సాధించారు. ఈ క్రమంలో రాగమాధురి, అమ్మమ్మ రాజేశ్వరి కలిసి శేషుకుమారిని తీర్థయాత్రల పేరుతో వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో విజయవాడ చేరుకున్నారు. శేషుకుమారితోపాటు రాజేశ్వరిని విజయవాడలో ఓ హోటల్‌లో ఉంచిన రాగమాధురి ఒంటరిగా గుడివాడ చేరుకుంది. నాయనమ్మ రమావతితో కలిసి రాగమాధురిని యజమాని ఇంట్లోని బీరువాను దొంగిలించి గుడ్లవల్లేరు తీసుకెళ్లి, అక్కడ దానిని పగులకొట్టి బంగారు, వెండి నగలతోపాటు విలువైన పట్టు చీరలను చోరీ చేశారు. గత నెల 30వ తేదీన ఇంటికి వచ్చిన శేషుకుమారికి తన ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటంతో పాటు బీరువా కనిపించకపోవడంతో తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్‌ఐ చంటిబాబు తన సిబ్బందితో కలసి చోరీ కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల మూడో తేదీ సాయంత్రం చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తూ మల్లాయపాలెం సమీపంలోని టిడ్కో సముదాయం వద్ద అనుమానాస్పదంగా ఉన్న రాజేశ్వరి, రమావతి, రాగమాధురిని ఎస్‌ఐ చంటిబాబు అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయం వెల్లడైంది. వారి వద్ద 71.04 గ్రాముల బంగారు, 327 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు విలువైన పట్టుచీరలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును నాలుగు రోజుల్లోనే ఛేదించిన ఎస్‌ఐ చంటిబాబు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ అభినందించి, నగదు రివార్డులను అందజేశారు. పోలీసులకు చిక్కిన ముగ్గురు మహిళలపై ఇప్పటికే రెండు మోసాల్లో కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో తాలూకా సీఐ ఎస్.ఎల్.ఆర్. సోమేశ్వరరావు, ఎస్‌ఐ ఎన్.చంటిబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.