
గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయండి
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలోని గృహనిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారించి త్వరితగతిన లక్ష్యాలను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాలులో గురువారం మధ్యాహ్నం గృహనిర్మాణ పురోగతిపై మండల, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేసీ గీతాంజలిశర్మ మాట్లాడుతూ.. జిల్లాలోని గృహనిర్మాణ పురోగతి ఆశించిన స్థాయిలో లేదన్నారు. లబ్ధిదారులతో కాంట్రాక్టర్లు తరచూగా సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణాలు త్వరతగతిన పూర్తి చేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఉయ్యూరు, తోట్లవల్లూరు మండలాల్లో పురోగతి శూన్యంగా ఉందన్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వివిధ దశల్లో ఉన్న గృహనిర్మాణాలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి అదనపు ఆర్థిక సాయం పొందుతున్న వెనుకబడిన వర్గాల వారు గృహాలను త్వరతగతిన నిర్మించుకునేలా ప్రోత్సహించాలన్నారు. అధికారులు లేఅవుట్లను క్షేత్రస్థాయిలో సందర్శించి అవసరమైన వాటికి అప్రోచ్ రోడ్లు, మెరక పనులు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో గృహనిర్మాణ సంస్థ ఇన్‌చార్జ్ అధికారి పోతురాజు, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డెప్యూటీ సీఈఓ ఆనంద్‌కుమార్, గిరిజన సంక్షేమశాఖాధికారి ఫణిదూర్జటి, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, డీఎస్‌ఓ జి.మోహన్‌బాబు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి.శివరామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.