
రైతులు ఆందోళన చెందొద్దు
మోదుమూడి, అవనిగడ్డలో
పర్యటించిన జేసీ గీతాంజలి శర్మ
అవనిగడ్డ: రైతులందరికీ యూరియా అందుతుందని ఎవరూ ఆందోళన చెందొద్దని జేసీ గీతాంజలి శర్మ చెప్పారు. జేసీ గీతాంజలి శర్మ గురువారం అవనిగడ్డ, మోదుమూడి గ్రామంలో పర్యటించారు. యూరియా కొరత, పంపిణీలో రైతులు పడుతున్న ఇబ్బందులను సాక్షిలో ‘ఒక్క కట్టకోసం పదిగంటలు’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ పరిస్థితిని తెలుసుకోవాల్సిందిగా ఆదేశించడంతో జేసీ పర్యటించారు. మోదుమూడి రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన ఆమె రైతులతో మాట్లాడి యూరియా పంపిణీని తెలుసుకున్నారు.
స్లిప్పులిచ్చినా యూరియా ఇవ్వలేదు
మన గ్రోమార్‌ని జేసీ గీతాంజలి శర్మ సందర్శించారు. అక్కడ స్టాకు నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు మాట్లాడుతూ మాకు స్లిప్పులు ఇచ్చినా యూరియా ఇవ్వలేదని చెప్పారు. ఆలస్యమైతే పిలకలు తొడగవని, ఎదుగుదల ఆగిపోతుందని, యూరియా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన జేసీ రెండు, మూడు రోజుల్లో స్టాక్ వస్తుందని, ఈ సారి ముందుగా వీరికి ఇచ్చిన తర్వాత మిగిలిన వారికి ఇవ్వాలని మన గ్రోమోర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, ఏవో ఏవో శుభహారిక, ఆర్‌ఐ బాలాజీ, వీఏవోలు పాల్గొన్నారు.

రైతులు ఆందోళన చెందొద్దు