
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
పామర్రు(మొవ్వ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ ఉదయం 9 గంటలకు పామర్రు మండలం కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో జోయాలుక్కాస్ జ్యూవెలరీ, బందన్ బ్యాంక్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, పేటీఎం లాంటి ప్రముఖ కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. ఈ కంపెనీల్లో ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా http://naipunya-mapgov.in వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు రెజ్యూమ్ లేదా బయోడేటాతో పాటు ఆధార్, ఆధార్‌కు లింక్ అయిన ఫోన్‌తో రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 80743 70846, 63006 18985 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): మెదడు ద్రవం ముక్కు ద్వారా కారడం వంటి అరుదైన సమస్యతో బాధపడుతున్న 35 ఏళ్ల శేషుకుమారికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ.వెంకటేశ్వరరావు తెలిపారు. ఒబెసిటీ కలిగిన పెరిమోనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుందని, ఆ సమయంలో హార్మోన్ లోపం కారణంగా ఎముకలు బలహీనమవుతాయని తెలిపారు. మెదడు పొరలు బలహీనమై, దగ్గు, బలంగా తుమ్మడం, మలబద్దకం వంటి పరిస్థితులు సమస్యను మరింతగా ప్రేరేపిస్తాయన్నారు. శేషుకుమారి పదేళ్లకు పైగా ఈ సమస్యతో బాధపడుతూ 2015లో విజయవాడ జీజీహెచ్‌లో, 2021లో గుంటూరులో ఓపెన్ క్రానియోటమీ సర్జరీలు చేయించుకున్నారని చెప్పారు. సమస్య మళ్లీ పునరావృతం కావడంతో ఆస్పత్రికి రాగా ఈఎన్‌టీ వైద్యులు ఆధునిక ఎండోస్కోపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స చేశారని సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని సమస్య నుంచి ఉపశమనం పొందారన్నారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ కె.రవి, ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ వినయ్, డాక్టర్ శాంతిలతను సూపరింటెండెంట్ అభినందించారు.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి