
దమ్ముంటే పట్టుకోండి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. రెక్కీ నిర్వహించి మరీ చోరీలు చేస్తున్నారు. ఘటనాస్థలంలో ఆధారాలు దొరక్కుండా, సీసీ కెమెరాలకు చిక్కకుండా పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలు భయపడుతున్నారు. శుభకార్యాలకు బంగారు నగలు ధరించాలంటే వణికిపోతున్నారు. విజయవాడలో వరుస చోరీలకు అడ్డుకట్ట వేసి, దొంగల భరతం పట్టడంలో పోలీసులు విఫలం అవుతున్నారు. పోలీసుల నిఘా కొరవడంతోనే దొంగలు రెచ్చిపోతున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల ఒకే ప్రాంతానికి చెందిన 35 మందికి పైగా దొంగలు రాష్ట్రానికి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు, నలుగురు ఒక బృందంగా విడిపోయిన దొంగలు వరుస చోరీలకు పాల్పడుతున్నారని, రైల్వే లైన్ వెంబడి ప్రాంతాలను ఎంచుకొని, దొంగతనం చేసిన వెంటనే మరో ప్రాంతానికి చెక్కేస్తున్నారని పోలీసులు గుర్తించారని సమాచారం.
కిటికీ గ్రిల్స్ తొలగించి..
విజయవాడలోని గుణదల గేటేడ్ కమ్యూనిటీలో జూలై ఐదో తేదీన చోరీ జరిగింది. చోరీ చేసింది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధార్ ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో చోరీ చేసే విధానం, శారీక దారుఢ్యం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ముగ్గురు సభ్యుల ముఠా రైళ్లలో ప్రయాణిస్తూ మార్గమధ్యంలోని ప్రాంతాలను ఎంచుకొని చోరీలకు తెగబడుతోంది. ఈ ముఠా ఇటీవల ఒకే రోజు పోలీసు కమిషనరేట్ పరిధిలోని గుణదల, గుంటుపల్లి, గొల్లపూడి ప్రాంతాల్లో పట్టపగలే వరుస చోరీలకు పాల్పడింది. రూ.12.98 లక్షల విలువైన ఆభరణాలు, నగదు చోరీ చేసింది. ఈ చోరీలన్నీ ప్రధాన ద్వారం గుండా కాకుండా హాలు, వాష్‌రూం ఇనుప గ్రిల్స్‌ను తొలగించి దొంగలు ఇళ్లలోకి ప్రవేశించి చేసినవే. అప్పటి నుంచి ఇప్పటి వరకు దొంగల ఆనవాళ్లను పోలీసులు గుర్తించలేదు. పెనుగంచిప్రోలులో జూలై 28వ తేదీన గ్రామానికి చెందిన తిరుపతమ్మ అమ్మవారి దేవాలయ మాజీ చైర్మన్ ఇంజం చెన్నకేశవరావు ఇంట్లో రూ.5 లక్షల విలువగల బంగారు ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలోనూ దొంగలు చిక్కలేదు.
జైళ్లలో పరిచయాలు
వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితులను రిమాండ్‌కు తరలించినప్పుడు జైళ్లలో తోటి దొంగలతో పరిచయాలు పెంచుకొని గ్రూపులుగా మారుతున్నారు. శిక్ష పూర్తయిన తరువాత బయటకు వచ్చి ఆ గ్రూపుల్లో సభ్యులంతా ఏకకాలంలో వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనే ఇటీవల వెలుగు చూసింది. ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన చందర్లపాడు మండలంలోని లక్ష్మీపురం, కాండ్రపాడు, లింగాలపాడు గ్రామాల్లో ఒకేరోజు ఆరు ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగలు భారీగా బంగారు ఆభరణాలు, నగదును దోచుకున్నారు.
పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు
పగలు రెక్కీ.. రాత్రివేళ ఇళ్లలో చోరీలు మహిళలే టార్గెట్‌గా చైన్ స్నాచింగ్‌లు టెక్నాలజీకి కూడా చిక్కకుండా చోరీలకు పాల్పడుతున్న దొంగలు పోలీసుల నిఘా వైఫల్యంతోనే దొంగతనాలని విమర్శలు
ముందే రెక్కీ
దొంగలు చోరీకి ముందే రెక్కీ నిర్వహిస్తున్నారు. ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. పాడైన వస్తువులను రిపేరు చేస్తామని అపార్ట్‌మెంట్లలోకి వచ్చి, ఆపై రెక్కీ నిర్వ హించి ఇళ్లను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగల్లో మైనర్లు కూడా ఉండటం గమనార్హం. కొందరు ప్రేమికులు సైతం తమ ఖర్చులు, విలాసాల కోసం చోరీల బాటపట్టారన్న విమర్శలు ఉన్నాయి.

దమ్ముంటే పట్టుకోండి